
ఉద్యమంలో కేటీఆర్ పాత్ర అసామాన్యం: బాల్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో మంత్రి కేటీఆర్ నిర్వహించిన పాత్ర అసామాన్యమని, జేఏసీ చైర్మన్ కోదండరాంతో పోల్చడం అసంబద్ధమైనదని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అప్పగించిన బాధ్యతతోనే కోదండరాం అంటే ప్రజలకు తెలి సిందని, అప్పటిదాకా కోదండరాం అంటే ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. అమెరికాలో 4 లక్షల జీతాన్ని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాల్గొన్నారన్నారు.
కోదండరాంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, టీడీపీ నేతలు స్పందించిన తీరు టీఆర్‌ఎస్ వాదనకు బలం చేకూర్చిందన్నారు. కాంగ్రెస్‌కు ఏజెంటుగా కోదండరాం పనిచేస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అప్పట్లో కోదండరాం ప్రయత్నించారని ఆరోపించారు. నోట్లకట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న కేటీఆర్ వల్లే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని, కొంతమంది విమర్శలు చేసినంత మాత్రాన ఆయన సంకల్పం ఆగిపోదన్నారు.