భాగ్యనగరినాకు రెండో ఇల్లు
ఏడు స్వరాలు ఆయన వేణువు నుంచి వెలువడితే చాలు, శ్రోతలకు ఏడేడు లోకాలలో సంచరించిన అనుభూతి సొంతమవుతుంది. పహిల్వాన్ల కుటుంబంలో పుట్టినా, కుస్తీ వైపు కాకుండా, సంగీతం వైపు ఆకర్షితుడై, అనతికాలంలోనే సంగీత రంగానికి తానే ఆకర్షణగా మారిన వేణుధర ధీరుడు హరిప్రసాద్ చౌరాసియా.
సంగీతాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం నగరానికి వచ్చిన చౌరాసియా, బిజీ షెడ్యూల్‌తో తలమునకలుగా ఉన్నా, ‘సిటీప్లస్’తో కొద్దిసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. సంగీతంలో తన ప్రస్థానాన్ని, హైదరాబాద్ నగరంతో తన అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు.
నగరం మారిపోయింది..
హైదరాబాద్ నాకు రెండో ఇల్లులాంటిది. తొలిసారిగా 1963లో ఇక్కడ అడుగుపెట్టా. అప్పట్లో ఈ నగరం చాలా చిన్నది. చిన్న హోటళ్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఫైవ్‌స్టార్ సిటీలా కనిపిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది.. తెలుగులో ‘సిరివెన్నెల’ చిత్రానికి వేణుగానాన్ని వినిపించా. సంగీత ప్రధానమైన ఆ చిత్రంలో హీరో ఫ్లూటిస్ట్. ఆ హీరో పాత్రకు వేణుగానాన్ని అందించా. తెలుగువారు ఇప్పటికీ ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ నా వద్ద ప్రస్తావిస్తుండటం నిజంగా ఆనందాన్నిస్తుంది.
ఇందుకు నాకు అవకాశం కల్పించిన దర్శకుడు విశ్వనాథ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగులో శంకరాభరణం, సిరివెన్నెల నాకు ఎంతో ఇష్టమైన చిత్రాలు. సంగీత ప్రధానమైన చిత్రాల్లో అవకాశం దొరికితే, ఇప్పుడు కూడా తెలుగు చిత్రాలకు పనిచేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నా. కర్ణాటక విద్వాంసుల్లో ఎం.ఎస్.గోపాలకృష్ణన్, బాలమురళీకృష్ణ, టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి వంటి వారి సంగీతాన్ని చాలా ఇష్టపడతా.
గానానికి, వేణునాదానికి ఏవీ సాటిరావు
ఎన్నో సంగీత పరికరాలు ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వాటి గొప్పతనం వాటికి ఉండొచ్చు. అయితే, గానానికి, వేణునాదానికి ఏవీ సాటిరావు. సంగీతం ఉన్నంత వరకు ఇవి ఎప్పటికీ నిలిచే ఉంటాయి. సంగీతమే నా ప్రపంచం. ఏ రాగం ఇష్టమంటే ఏం చెప్పను? అన్ని రాగాలూ ఇష్టమే.
సంగీతాన్ని సిలబస్‌లో చేర్చాలి
పిల్లలకు స్వతహాగా సంగీతంపై మక్కువ ఉంటుంది. వారిని సంగీతం వైపు ప్రోత్సహించాలి. సంగీతంపై వారి మమకారాన్ని ప్రోత్సహించేందుకు సంగీతాన్ని ఒక సబ్జెక్టుగా సిలబస్‌లో పెట్టాలి. పరీక్షలు కూడా పెట్టాలి. అప్పుడే మన సంగీతానికి మనుగడ ఉంటుంది.
రియాలిటీ ‘షో’లు సరిపడవు
సంప్రదాయ సంగీతానికి రియాలిటీ షోలు సరిపడవు. వాటి ద్వారా పిల్లలు నేర్చుకుంటారనే వాదనను నేను అంగీకరించను. గురు-శిష్య సంబంధంతోనే సంగీతం ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది.
- ప్రవీణ్‌కుమార్ కాసం