అది తప్పుడు కేసు: రంభ సోదరుడు
తన భార్య పల్లవి పెట్టినది తప్పుడు కేసని, తమ ఇంట్లో ఉన్న వజ్రాల నగలు, పిల్లలను తీసుకుని ఆమె ఫిబ్రవరి 3వ తేదీన చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లిపోతే.. 4వ తేదీన తమ తండ్రి చెన్నైలో కేసు నమోదు చేశారని రంభ సోదరుడు శ్రీనివాస్ తెలిపారు. తన భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు విషయమై ఆయన 'సాక్షి'తో మాట్లాడారు. కెనడాలోని టొరంటోలో ఉన్న తాను ఈ విషయం తెలిసి ఫిబ్రవరి 12వ తేదీన వచ్చానన్నారు. దొంగతనం కేసును తప్పుదోవ పట్టించడానికే ఇప్పుడీ వరకట్నం కేసు పెట్టారని ఆయన అన్నారు. తమకు పెళ్లయ్యి 15 సంవత్సరాలు అయ్యిందని, పెద్ద కొడుకుకు 14 ఏళ్లు, చిన్న కుమారుడికి 10 ఏళ్లు ఉన్నాయని తెలిపారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని వేధింపులు ఇప్పుడే ఎలా గుర్తుకొచ్చాయని శ్రీనివాస్ ప్రశ్నించారు.
తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, తనను అరెస్టు చేయకూడదని కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన వివరించారు. 1999లో పల్లవితో తనకు పెళ్లయ్యే సరికి వాళ్లు అద్దె ఇంట్లో ఉండేవారని, ఇప్పుడు వాళ్లకు ఒక బంగ్లా, మూడు ఫ్లాట్లు ఎక్కడినుంచి వచ్చాయని ఆయన అడిగారు. అసలు వాళ్లు ఏ రూపంలో కట్నం ఇచ్చారో రుజువు చేయాలన్నారు. తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, అయితే 498ఎ సెక్షన్ను ఇలా దుర్వినియోగం చేయడం మాత్రం సరికాదని ఆయన చెప్పారు.