
అన్ని జిల్లాల్లో ‘భరోసా’ కేంద్రాలు
ఉమెన్ అండ్ చైల్డ్ ఎక్స్‌పో ప్రారంభంలో నాయిని నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: న్యాయపరంగా, వైద్యపరంగా, చట్టపరంగా హైదరాబాద్‌లోని బాధిత మహిళలకు అండగా ఉంటున్న ‘భరోసా’ కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు, షీ టీమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా వద్ద ‘ఉమెన్ అండ్ చైల్డ్ ఎక్స్‌పో’ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల ఈ ఎక్స్‌పోను శనివారం నాయిని ప్రారంభించారు. తెలంగాణ వచ్చాక మహిళల భద్రత కోసం ప్రారంభించిన షీటీమ్స్ సేవలు సత్ఫలితాలి స్తున్నాయని, వీటిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని నాయిని చెప్పారు. మహిళల భద్రత కోసం కృషి చేస్తున్న షీటీమ్ సేవలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు.
దీనికితోడు నగర పోలీసులు ప్రారంభించిన ‘భరోసా’ రాకతో బాధిత మహిళలు, పిల్లలకు సత్వర న్యాయం, వైద్యం, కౌన్సెలింగ్ లభిస్తున్నాయన్నారు. రాజధాని అభివృద్ధి శరవేగంగా సాగేందుకు ‘భద్రత’ ఉపయోగపడుతుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. నేరరహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలన్న ట్యాగ్‌లైన్‌తో ఆదివారం ఉదయం నిర్వహించే ‘షీటీమ్స్ 5కే రన్’లో ప్రజలను కూడా భాగస్వాములు చేసే దిశగా చర్యలు తీసుకున్నామని నగర అదనపు పోలీసు కమిషనర్, షీటీమ్స్ ఇన్‌చార్జ్ స్వాతిలక్రా తెలిపారు. అనంతరం బాలికలపై లైంగిక వేధింపులపై తీసిన షార్ట్ ఫిల్మ్‌లను ప్రదర్శించారు.