నవరస నటనాసార్వభౌముడు | nata sarvabhouma kaikala satyanarayana | Sakshi
Sakshi News home page

నవరస నటనాసార్వభౌముడు

Published Sat, Dec 28 2013 5:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

నవరస నటనాసార్వభౌముడు

నవరస నటనాసార్వభౌముడు

నటన ఆయనకు ప్రాణప్రదం. నవరసభరితమైన నటనకు ఆయన చిరునామా. అది గంభీరమైనా, వీరమైనా, రౌద్రవమైనా ఆయన హావభావాల్లో మాత్రమే అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా సరే ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. ఆ పాత్రలకే ప్రాణప్రతిష్ట చేస్తారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలను తెలుగు ప్రేక్షక లోకానికి ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కితే... ‘యమధర్మరాజు’కు జీవం పోసిన ఖ్యాతి మాత్రం ఈయనకే దక్కింది. ఆయనెవరో కాదు కైకాల సత్యనారాయణ.  నిలువెత్తు విగ్రహం. చక్కటి దేహదారుఢ్యం. గంభీరమైన అభినయం. తలపై బంగారు కిరీటం. ఒక చేతిలో భారీగద. మరో చేత్తో మెలిపెట్టే కోరమీసం. నాటి యమగోల నుంచి నేటి యమలీల వరకు యముడంటే సత్యనారాయణే. యమధర్మరాజును ఎంతో ఉన్నతంగానూ, మరెంతో హాస్యభరితంగానూ ఆవిష్కరించిన వైవిధ్యభరితమైన నటన ఆయనకే  సొంతం. తెలుగు సినిమాకు ఎస్వీ రంగారావు అంతటి ప్రతినాయకుడు కైకాల. మహానటుడు ఎన్టీఆర్ నటనలోని అనేక లక్షణాలను పుణికి పుచ్చుకొని ఎదిగిన వ్యక్తి. ‘ఏదీ దానంతట అదే రాదు. కష్టపడి సాధించాలి. ఏ రంగంలోనైనా రాణించాలంటే కృషి, పట్టుదలలే పెట్టుబడి’ అని నమ్మిన కైకాల తన కెరీర్‌లో మొక్కవోని దీక్షతో ఎదిగారు. మంచి క్యారెక్టర్ వస్తే నటించేందుకు తాను ఎప్పటికీ సిద్ధమేనని చెబుతున్న ఆయన అంతరంగ ఆవిష్కరణే ఈ వారం‘లెజెండ్’...                       
 
‘చిన్నప్పటి నుంచే నాటకాలు వేసేవాడ్ని. పెద్ద జులపాల జుత్తు ఉండేది నాకు. నేను నాటకాలు వేసే రోజుల్లోనే అందరూ ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయంటూ అభినందించేవారు. ఎప్పటికైనా సినిమాల్లో రాణిస్తారనే వాళ్లు. నాకు సినిమాల్లో నటించాలనే అభిప్రాయం అప్పటికైతే లేదు. కానీ బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనుకున్నాను. పదోతరగతిలో, ఇంటర్‌లో ‘ప్రభాకర్ నాట్యమండలి’, ‘నటరాజ కళా సమితి’పేర్లతో  రాష్ర్టమంతటా నాటకాలు ప్రదర్శించాం. పదోతరగతిలోనే ‘ప్రేమ లీలలు’ అనే నాటకంలో మొదటి సారి విలన్ పాత్రలో నటించాను. దానికి బంగారు పతకం లభించింది. ‘పల్లెపడుచు’, ‘కులం లేని పిల్ల’, ‘బంగారు సంకెళ్లు’, ఆడది, సుల్తాన్ వంటి నాటకాలు ప్రదర్శించాం. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ‘ఎవరుదొంగ’ అనే నాటకంలో హీరో పాత్రలో నటించాను. మంచి గుర్తింపు లభించింది. నా నటనలో ఎన్టీరామారావు పోలికలు ఉన్నాయంటూ ప్రముఖ రంగస్థల నటులు గరికపాటి రాజారావు ఎంతగానో ప్రశంసించారు. సినిమాల్లోకి ఆహ్వానించారు. కానీ సినిమా వైపు వెళ్లకుండా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగప్రయత్నాలు ప్రారంభించాను. ఇదంతా 1954-55 నాటి సంగతి. ఉద్యోగం రాలేదు. అప్పటికే మాకు ఉన్న కలప వ్యాపారం చూసుకొనేందుకు రాజమండ్రికి వెళ్లాను. అక్కడ 3 నెలలు మాత్రమే ఉన్నాను. అక్కడి నుంచి మద్రాస్ వెళ్లాను. నా చిన్నప్పటి స్నేహితుడు కెఎల్ ధర్ 1956లో ఒక ఉత్తరం రాశాడు. సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెంటనే రమ్మని. అలా అనుకోకుండా అతని ఆహ్వానం మేరకు మద్రాస్ వెళ్లవలసి వచ్చింది.
 
ఎన్టీఆర్ నా అన్నయ్య..
 
మహానటుడు ఎన్టీరామారావు నన్ను సొంత తమ్ముడిలా ఆదరించారు. ఆయనతో కలిసి చాలా చిత్రాల్లో నటించడం వల్ల ఎంతో దగ్గరయ్యాము. నన్ను ఆయన ‘తమ్ముడూ’అనే పిలిచేవారు. ఎంతో ప్రేమగా చూసుకొనే వారు. తారకమ్మ గారు కూడా సొంత మరిదిలాగానే నన్ను ఆదరించారు. సినిమా పరిశ్రమలో నాకు  డీఎల్ నారాయణ కన్నతండ్రి వంటి వారైతే విఠలాచార్య పెంచిన తండ్రి. కెరీర్‌లో పైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీరామారావు. ఆయన పార్టీ స్థాపించిన సమయంలో నేను, నాదెండ్ల ఇద్దరమే ఉన్నాము. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పార్టీ గురించే ఎక్కువగా చర్చించేవారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. అప్పుడే జన్మ సార్థకమవుతుందనే వారు. ఆ తరువాత ఆయన పార్టీ పెట్టి అపూర్వమైన విజయం సాధించారు. నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ నాకు ఉన్న బాధ్యతల దృష్ట్యా వెళ్లలేదు. కానీ 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం తరఫున ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఆ తరువాత ప్రభుత్వం పడిపోవడం, తిరిగి చంద్రబాబు హయాంలో మరోసారి పోటీ చేయడం తెలిసిందే. కానీ అప్పుడు ఓడిపోయాను. ఇక మరో మహానటుడు అక్కినేనితోనూ నాకు చిన్నప్పటి నుంచే మంచిసంబంధాలు ఉండేవి. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్.
 
 మలుపుతిప్పిన ‘సిపాయి కూతురు’..  

 ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో సహాయ కళాదర్శకుడుగా పని చేసేవాడు ధర్. ‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమాలో నటించేందుకు నన్ను రమ్మని పిలిచాడు. కానీ నేను వెళ్లిన తరువాత ప్రసాద్ ప్రొడక్షన్స్ వాళ్లు అసలు ఆ సినిమా  తీయనేలేదు. నన్ను అన్ని విధాలుగా పరీక్షించారు ప్రసాద్. సినిమాలో అవకాశం మాత్రం రాలేదు. అప్పటికే  ‘రాజు-పేద’ వంటి సినిమాలు తీసిన అగ్రశ్రేణి నిర్మాత బీవి సుబ్బారావును కలిశాను. అభినయం బాగుందన్నారు. అవకాశం ఉన్నప్పుడు పిలుస్తానన్నారు. ఆ తరువాత తెలుగు చలన చిత్ర పితామహులు కేవీ రెడ్డిని కలిశాను. అప్పటికే నేను మద్రాస్ వచ్చి ఏడాది అయింది. మరో నాలుగైదు రోజుల్లో సంక్రాంతి.. ఇక సినిమాల్లో అవకాశం రాదని నిర్ణయించుకున్నాను. నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.

అలాంటి సమయంలో  ఆయన నాలుగు రోజులు నన్ను టెస్ట్ చేశారు. సంతృప్తి చెందారు. అవకాశాలు తప్పకుండా వస్తాయని, ఓపిగ్గా ఎదురు చూడాలని చెప్పారు. ఇంటికి వెళ్లిపోవద్దని సలహా ఇచ్చారు. ‘దేవదాసు’ చిత్ర నిర్మాత డీఎల్ నారాయణ రూపంలో ఆ అవకాశం వచ్చింది. ఆయన తీసిన ‘సిపాయి కూతురు’ సినిమాలో హీరోయిన్ జమున సరసన హీరోగా నటించాను. ఆ తరువాత మరో మూడేళ్ల పాటు ఎలాంటి అవకాశాలు రాలేదు. అప్పుడే  బి.విఠలాచార్య నన్ను విలన్ పాత్రల్లో నటించమని ప్రోత్సహించారు. రాజనాల తరువాత విలన్‌గా రాణించినవాళ్లు పెద్దగాలేరన్నారు. దాంతో 1960 జనవరిలో విడుదలైన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలో విలన్ పాత్రలో నటించాను.

ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘కనకదుర్గ పూజా మహిమ’, శ్రీకృష్ణ పాండవీయం’ ఎన్టీరామారావు ద్విపాత్రాభినయం చేసిన ‘అగ్గిపిడుగు’వంటి అనేక సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటించాను. ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా ఒక మరిచిపోలేని అనుభూతి. ఎన్టీరామారావుకు అన్నయ్యగా జాలిగొలిపే పాత్రలో నటించాను. మంచిపేరు వచ్చింది. ‘శారద’ సినిమా నా కెరీర్‌లో మరో మలుపు. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చింది. కేవలం విలన్ పాత్రలే కాదు. కామెడిలో కూడా బాగా నటించగలనని చాటుకున్నాను. ‘సీతాకల్యాణం’లో రావణాసురుడిగా, ‘దానవీరశూరకర్ణ’లో భీముడిగా, ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా, ‘పాండవ వనవాసం’లో ఘటోత్కచుడిగా, ‘చాణక్య చంద్రగుప్త’లో రాక్షస మంత్రిగా ‘మొల్ల’ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా ‘యమగోల’, ‘యమలీల’చిత్రాల్లో యమధర్మరాజుగా నటించాను. అన్ని రకాల పాత్రలు వేశాను. మొత్తం 772 సినిమాల్లో నటించాను. ఈ మధ్య ‘దరువు’లో కూడా యముడి పాత్రలోనే నటించాను.
 
 వ్యక్తిగతం
 పేరు: కైకాల సత్యనారాయణ
 పుట్టిన తేదీ: 25 జూలై, 1935
 తల్లిదండ్రులు: సీతారామమ్మ, లక్ష్మీనారాయణ
 భార్య: నాగేశ్వరమ్మ
 సంతానం: లక్ష్మీనారాయణ, కేవీ రామారావు, పద్మావతి, రమాదేవి
 
 సేవా కార్యక్రమాలు
 స్వస్థలం కౌతారం(కృష్ణాజిల్లా)లో తాత పేరు మీద ‘కమ్మంమెట్టు రామయ్య మొమోరియల్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి’ కట్టించారు.
 
 గుడివాడలో ‘కైకాల సత్యనారాయణ పురపాలక కళామండపం’ నిర్మించారు.
   
 పేద విద్యార్థుల చదువులు, పెళ్లిళ్లు, ఉపాధికి సహకారం అందిస్తున్నారు.
 
 అవార్డులు..
 -తాత-మనవడు, సంసారం-సాగరం, కచదేవయాని చిత్రాల్లో అత్యుత్తమ నటనకు మూడు సార్లు నంది అవార్డులు.
 - ప్రతిష్టాత్మక రఘుపతి వెంక య్య అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సన్మానం..
 ఇలాంటివెన్నో...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement