కాలుష్య కారక నదుల్లో జాతీయ స్థాయిలో మూసీ స్థానం 4
స్వచ్ఛమైన జలంతో నగరవాసుల దాహార్తి తీర్చిన జలాశయం నేడు అత్యంత విషతుల్యమైంది. గతమెంతో ఘన చరిత్ర ఉన్న మూసీనది నేడు కాలుష్య కాసారంగా మారింది. గరళ సాగరాలుగా మారిన నదుల్లో జాతీయ స్థాయిలో నాలుగో స్థానం దక్కించుకోవడం సిటీజనులను కన్నీరు పెట్టిస్తోంది. ఈ నీటిని తాగితే పశుపక్ష్యాదులు, చేపలు మత్యువాత పడడం తథ్యం. పొరపాటున ఎవరైన ఈ నీటిని తాకిన భయంకరమైన చర్మవ్యాధులు రావడం ఖాయం. ఈ జలాలతోఉప్పల్, పీర్జాదీగూడ, ప్రతాప సింగారం,పిల్లాయిపల్లి తదితర ప్రాంతాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయల్లోనూ కాలుష్య ఆనవాళ్లు కనిపించడం భయాందోళనకు గురి చేస్తోంది.
పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల్లోనూ కాలుష్య వ్యర్థాలు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మూసీలో బీఓడీ(బయలాజికల్ ఆక్సిజన్ డివూండ్) ప్రమాదకర స్థారుుకి చేరింది. దీంతో సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ పరిమాణం కనిష్ట స్థాయికి పడిపోయింది. వ్యర్థ రసాయనాలు అత్యధికంగా కలవడం వల్ల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ ) కూడా బాగా పెరిగినట్లు తేలింది. సాధారణంగా సీఓడీ నీటిలో ఉండరాదు. కానీ పరిస్థితి ఇప్పటికే చేయిదాటింది.
ఇక నీటి క్షారత(పీహెచ్) అనూహ్యంగా ఏడు యూనిట్లను మించడం కలవరపెడుతోంది. గత కొన్ని నెలలుగా ఈ నదిలో కాలుష్య కారకాల పరిమితి ప్రమాదకర స్థాయిలో పెరిగిందని పీసీబీ నివేదిక నిగ్గు తేల్చింది. నగరంలో మూసీ నది సుమారు 25 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. రోజూ 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈ నదిలోకి ప్రవేశిస్తోంది.
- సాక్షి, సిటీబ్యూరో