నయీమ్.. ఎమ్మెల్యే.. ఓ క్లిక్! | nayeem case sitfound photographs of politicians with gangstar | Sakshi
Sakshi News home page

నయీమ్.. ఎమ్మెల్యే.. ఓ క్లిక్!

Published Wed, Sep 7 2016 2:25 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

నయీమ్.. ఎమ్మెల్యే.. ఓ క్లిక్! - Sakshi

నయీమ్.. ఎమ్మెల్యే.. ఓ క్లిక్!

గ్యాంగ్‌స్టర్‌తో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫొటోలు
షాద్‌నగర్ డెన్‌కు కూడా వె ళ్లినట్లు ధ్రువీకరణ!
మరో ఎమ్మెల్యేను టార్గెట్ చేసేందుకు గ్యాంగ్‌స్టర్ కుట్ర
అతడి అనుచరులకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూర్చి చేరదీసిన నయీమ్
జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ వాయిస్ రికార్డులూ లభ్యం!
ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధుల అరెస్ట్
కేసును పక్కదారి పట్టించే యత్నాలు జరుగుతున్నాయా?
ఇటీవలి ఐపీఎస్‌ల బదిలీల వెనుక ఆంతర్యం అదేనా?

 
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో తీగ లాగితే డొంకలు కదులుతున్నాయి. నయీమ్‌కు నల్లగొండతోపాటు ఇతర జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యమే అయినా.. అందుకు ఆధారాలు లేకపోవడంతో అవి ఇన్నాళ్లూ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు తాజాగా దొరికిన కొన్ని ఫొటోలు రాజకీయ ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నయీమ్‌తో కలసి ఉన్న ఆ ఫొటోలను చూసి దర్యాప్తు వర్గాలు విస్తుపోయాయని సమాచారం. ఎమ్మెల్యేగా ఉంటూ అంత దర్జాగా నయీమ్‌తో ఎలా ములాఖత్ అయ్యాడు.. ఎందుకు భేటీ అయ్యాడనే కోణంలో దర్యాప్తు వర్గాలు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
 
ఈ దర్యాప్తులో కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ ఎమ్మెల్యే మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లేనని సమాచారం. నల్లగొండ జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే అనుచరులకు కూడా నయీమ్ పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూర్చాడని, అయితే ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేయాలన్న ఆలోచనతోనే నయీమ్ వారికి ఈ లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారానికి తోడు మరో ఎమ్మెల్సీకి సంబంధించిన ఆధారాలూ దర్యాప్తు వర్గాలకు లభించాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను నయీమ్ కేసులో అరెస్టు చేశారు. జిల్లా నేతలకు నయీమ్‌తో ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో దర్యాప్తును పక్కతోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం కలిగించారని చెబుతున్నారు.
 
ఎందుకు కలిశారు?
నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నయీమ్‌ను వ్యక్తిగతంగానే కలిశాడన్న ఆధారాలు పోలీసులకు లభించాయి. ఓసారి చాయ్ తాగుతూ, మరోసారి టిఫిన్ చేస్తూ... ఇంకో రెండుసార్లు కూర్చుని మాట్లాడుతూ ఉన్న నాలుగు ఫొటోలు దర్యాప్తు వర్గాలకు లభించాయి. షాద్‌నగర్ డెన్‌తో పాటు మరో రెండు చోట్ల నయీమ్‌ను కలసినప్పుడు ఈ ఫొటోలు తీశారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. షాద్‌నగర్ డెన్‌కు సాధారణంగా ఎవరినీ అనుమతించని నయీమ్ (కేవలం సెటిల్మెంట్ల కోసమే దీన్ని ఉపయోగించుకుంటాడు) ఈ ఎమ్మెల్యేను ఎలా అనుమతించాడు? ఎందుకు అనుమతించాడనే కోణంలో దర్యాప్తు వర్గాలు సీరియస్‌గా విచారణ చేస్తున్నాయి. జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యేతో నయీమ్‌కు వైరం ఉన్న నేపథ్యంలో.. ఈ ఎమ్మెల్యే అక్కడకు ఎందుకు వెళ్లాడ న్నది కూడా అర్థం కాని పరిస్థితి.
 
మరోవైపు జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే అనుచరులకు కూడా నయీమ్ పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చాడు. ఆ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడయిన ఒకరికి యాదగిరిగుట్ట సమీపంలో రూ.కోటి విలువైన భూమిని రూ.20 లక్షలకే ఇప్పించాడని సమాచారం. గతంలో ఈ ఎమ్మెల్యేతో కలిసి పనిచేసిన వ్యక్తిని నయీమ్ ముఖ్య అనుచరుడి డ్రైవర్‌గా పెట్టుకోవడం, ఆ ఎమ్మెల్యేకు వైరం ఉన్న మరికొందరని చేరదీయడాన్ని చూస్తే సదరు ప్రజాప్రతినిధిని చంపాలనే ఆలోచనతో నయీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే అనుచరులను, వ్యతిరేకులను ఏకకాలంలో తనకు అనుకూలంగా మల్చుకోవడం ద్వారా అతడిని ఒంటరిని చేసి దాడి చేయాలనేదే గ్యాంగ్‌స్టర్ వ్యూహమని, గతంలో నయీమ్ చేసిన హత్యలు కూడా అలాంటివేనని పోలీసులంటున్నారు.
 
పెద్దోళ్లపై ఏం చేస్తారో?
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి నయీమ్‌తో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలిందని, మొదట్నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్సీ నయీమ్‌తో పలుమార్లు మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా పోలీసుల వద్ద ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను నయీమ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్ అనుచరులుగా గుర్తింపు పొందిన వారిలో భువనగిరి జెడ్పీటీసీ సభ్యుడు సందెల సుధాకర్.. నయీమ్ ఎన్‌కౌంటర్ కన్నా ముందే పీడీ యాక్ట్ కేసులో పోలీసులకు లొంగిపోయాడు.

నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేశ్, వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, భువనగిరికి చెందిన కౌన్సిలర్ ఎండీ నాసర్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఎంపీపీలు, కౌన్సిలర్ల వంటి చోటా నేతల అరెస్టుల వరకే పోలీసులు పరిమితం అవుతారా.. లేక  నయీమ్‌తో సంబంధాలున్నాయని తేలిన పెద్ద నాయకులను కూడా కటకటాల వెనుక పెడతారా అన్నది వేచి చూడాల్సిందే.
 
మిర్యాలగూడలో గణేశ్ వేడుకలకు ప్లాన్
నయీమ్ ఎన్‌కౌంటర్ కాకపోయి ఉంటే ఈసారి వినాయక ఉత్సవాలకు మిర్యాలగూడను వేదికగా చేసుకునేవాడని, ఇందుకు సంబంధించిన ఆధారాలు దొరికాయని సమాచారం. గతంలో భువనగిరికి మాత్రమే పరిమితమైన వినాయక ఉత్సవాలను గతేడాది నల్లగొండలో నిర్వహించిన నయీమ్.. ఈసారి మిర్యాలగూడలో పెద్ద ఎత్తున జరపాలని భావించాడు. అందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని తెలుస్తోంది. నయీమ్ కేసులో అరెస్టయిన ఐ-టెన్  న్యూస్ విలేకరి హరిప్రసాద్‌రెడ్డి మిర్యాలగూడకే చెందిన వాడు కావడం, అక్కడి ప్రజాప్రతినిధులు, పోలీసులతో అతడికి సంబంధాలుండడంంతో గ్యాంగ్‌స్టర్ ఈ ఏడాది వినాయక ఉత్సవాలకు పక్కా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది.
 
ఎవరైనా ‘క్లిక్’మనాల్సిందే
నల్లగొండ ఎమ్మెల్యేనే కాదు.. నయీమ్‌ను ఎవరు కలిసినా వారి ఫొటో కచ్చితంగా ఉంటుందని దర్యాప్తు వర్గాలంటున్నాయి. ఎందుకంటే  అతడితో ములాఖత్ అయ్యారంటే ఫొటో క్లిక్‌మనాల్సిందే. నయీమ్‌కు అంగరక్షకులుగా ఉండే యువతుల్లో ఓ అమ్మాయి వద్ద కెమెరా ఉంటుందని, ఆమె ఎదుటి వ్యక్తికి తెలియకుండా క్లిక్‌మనిపిస్తుందని పోలీసులంటున్నారు. ఈ ఏర్పాటుతోపాటు నయీమ్ వ్యక్తిగతంగా కలిసే సీక్రెట్ రూంలో ఎవరికీ కనిపించకుండా సీసీ కెమెరాలు కూడా ఉంటాయని పోలీసులంటున్నారు.

నయీమ్ ఎంత పక్కాగా ఉంటాడంటే.. ఎన్‌కౌంటర్ కావడానికి 10 నిమిషాల ముందు కూడా అతడు ఓ పోలీస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడాడని, ఓ డీల్‌కు సంబంధించిన ఒత్తిడి తెచ్చినా ఆ డీఎస్పీ స్థాయి అధికారి అంగీకరించలేదని, ఇదే విషయాన్ని గ్యాంగ్‌స్టర్ తన డైరీలో రాసుకున్నాడని పోలీసు వర్గాలంటున్నాయి. ప్రతి విషయాన్ని డైరీలో రాసుకునే అలవాటున్న నయీమ్ తాను ఇతరులతో జరిపిన ప్రతి సంభాషణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేవాడని చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement