
నిలువ నీడ ఏదీ?
బస్ షెల్టర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం
మండుటెండలో ప్రయాణికుల పడిగాపులు
ఏటా అదేతీరు... మండిపడుతున్న నగర ప్రయాణికులు
630 చోట్ల షెల్టర్లు అవసరం
సిటీబ్యూరో: నగరంలో బస్‌షెల్టర్ల నిర్మాణంపై ఏళ్లకేళ్లుగా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రతి ఏటా ప్రభుత్వం ప్రతిపాదనలతోనే సరిపెట్టేస్తోంది. దీంతో నిలువ నీడలేని దుస్థితిలో ప్రయాణికులు మండుటెండల్లో బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నెల మొదటి వారంతోనే ఎండ నిప్పులు చెరుగుతోంది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రతను ఊహించుకోవడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడొస్తుందో తెలియని సిటీ బస్సు కోసం గంటల తరబడి షెల్టర్‌లు లేని బస్టాపుల్లోనే ప్రయాణికులు ఎదురు చూడాల్సి వస్తుంది. విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. నగరంలోని సుమారు 2000 చోట్ల బస్టాప్‌లు ఉన్నాయి. కోఠీ, సనత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ రెతిఫైల్ వంటి కొన్ని ప్రాంతాల్లో బస్‌స్టేషన్‌లు, ఇందిరాపార్కు, లక్డీకాపూల్, కేపీహెచ్‌బీ, తార్నాక, ఎల్‌బీనగర్ వంటి ప్రధాన రహదారులపై ఉన్న బస్టాపులు, బస్‌బేల్లో మాత్రమే షెల్టర్లు ఉన్నాయి. చాలా చోట్ల ప్రయాణికులు మండుటెండల్లోనే నించొని బస్సు కోసం ఎదురు చూస్తున్నారు.
630 చోట్ల షెల్టర్లు అవసరం...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణం నుంచి వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క రెతిఫైల్ బస్‌స్టేషన్ మినహా మరెక్కడా సరైన షెల్టర్లు లేవు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాపులో కొన్ని రూట్లకు మాత్రమే షెల్టర్ సదుపాయం ఉంది. అల్వాల్, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్, ఆఫ్జల్‌గంజ్, కోఠీ, చార్మినార్ వైపు వెళ్లే ప్రయాణికులు ఎండల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే బస్టాపులోనూ ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని షెల్టర్లు లేవు. రోడ్డుపైనే నిలుచుంటున్నారు. రామంతాపూర్, అంబర్‌పేట్, తదితర చోట్ల షెల్టర్లు లేకపోవ డంతో ప్రయాణికులు ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడ నిల్చుంటున్నారు. అమీర్‌పేట్ మైత్రీవనమ్, సారథి స్టూడియో, ఎర్రగడ్డ చౌరస్తా, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్, జెక్‌కాలనీ, ఎర్రగడ్డ చౌరస్తా, బల్కంపేట్‌లలో షెల్టర్లు లేవు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2000 బస్టాపుల్లో ప్రస్తుతం 1370 చోట్ల బస్‌షెల్టర్లు ఉన్నాయని, మరో 630 చోట్ల లేవని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు వీటి నిర్మాణం చేపట్టవలసి ఉందని అభిప్రాయపడుతున్నారు. కానీ నగరంలోని చాలా చోట్ల మెట్రో నిర్మాణ పనుల దష్ట్యా షెల్టర్లను తొలగించారు. మరోవైపు బస్టాపులు లేని చోట కేవలం వ్యాపార ప్రకటనల కోసం షెల్టర్లును ఏర్పాటు చేశారు. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ వంటి జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో బస్టాపులతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన షెల్టర్లు నిరుపయోగంగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల చిరువ్యాపారులు, ఇతరులు ఆక్రమించుకొని వాటి ఉనికినే మార్చివేశారు. ఆర్టీసీ గుర్తించిన 630 షెల్టర్ల కోసం గత సంవత్సరమే జీహెచ్‌ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా లక్షలాది మంది మండుటెండల్లో మలమల మాడుతూ బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.
క్యూ రెయిలింగ్‌దీ అంతే సంగతులు...
ముంబయి తరహాలో క్యూ రెయిలింగ్ కోసం రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పట్లో మం త్రులు, ఉన్నతాధికారులు ముంబయికి వెళ్లి క్యూ పద్ధతిని అధ్యయనం చేసి వచ్చారు. అబిడ్స్ మార్గంలో ఈ పద్ధతిని అమలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ట్రాఫిక్ రద్దీ, ఇతర కారణాల దష్ట్యా ఆచరణ సాధ్యం కాదని విరమించారు. ఆ తరువాత నగరంలోని 152 ప్రాంతాల్లో బస్‌బేలను ఏర్పాటు చేసి క్యూ రెయిలింగ్ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లక్డీకాఫూల్, నాగోల్, ఎల్‌బీనగర్, సుచిత్ర, కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్ వంటి పలు ప్రాంతాల్లో రెయిలింగ్‌కు అవకాశం ఉన్న చోట బస్‌బేలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.