
మాకు రక్షణ కల్పించండి
* ఎన్నికల సంఘం కార్యదర్శితో నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు
* మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20న జరగనున్న నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నికలో తాము స్వేచ్ఛగా పాల్గొనేలా రక్షణ కల్పించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జెడ్పీటీసీలు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలతో పాటు 23 మంది జెడ్పీటీసీ సభ్యులు మిట్టల్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఈ నెల 5, 13 తేదీల్లో రెండుసార్లు జిల్లా జెడ్పీ చైర్మన్ వాయిదా పడిన సమయంలో జిల్లా అధికారులు, కొందరు పోలీసులు వ్యవహరించిన పక్షపాత ధోరణికి సాక్ష్యాలుగా కొన్ని సీడీలను అందజేశారు. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీలను గెలుచుకోకపోయినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ ఎలాగైనా జెడ్పీ చైర్మన్ దక్కించుకోవాలన్న ఆలోచనతో సాగిస్తున్న ఆరాచకాలను అడ్డుకోవాలని.. వారికి వత్తాసు పలుకుతున్న కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు జెడ్పీ కోసం స్వయంగా రంగంలోకి సీఎం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఏదో విధంగా దక్కించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. అందులో భాగంగానే జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు ఒకరోజు ముందు ఆయన జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రైతు నాయకులను కలుసుకునే నెపంతో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులను నేరుగా కలుసుకుని వారికి మరిన్ని ప్రలోభాలను ఎర చూపించనున్నట్లు సమాచారం. జిల్లాలో వైఎస్సార్‌సీపీ 31 జెడ్పీటీసీ స్థానాలు చేజిక్కించుకోగా, టీడీపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. దీంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడాన్ని టీడీపీ అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.