
నకిలీ నోట్ల దోషులకు శిక్ష సబబే..
ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులతో కలసి నకిలీ రూ.500, రూ.1,000 నోట్లను పెద్ద ఎత్తున చలామణిలోకి తీసుకొచ్చిన కేసులో పలువురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఉమ్మడి హైకోర్టు సమర్థించింది. ప్రత్యేక కోర్టు శిక్షను సవాల్ చేస్తూ మసూద్ అక్తర్ అన్సారీ, మహ్మద్ షఫీ, షేక్ అక్రమ్ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కే జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. నిందితులు నేరం చేసినట్లు ఎన్‌ఐఏ నిరూపించగలిగిందని, ప్రత్యేక కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని జైలుశిక్ష విధించిందని, కాబట్టి అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
అయితే నకిలీ నోట్ల చలామణి వెనుక కుట్ర ఉందని మాత్రం నిరూపించలేకపోయారని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మోర్జన్ హుస్సేన్, రకీబ్ షేక్ మరికొందరు ఓ బృందంగా ఏర్పడి నకిలీ నోట్లను చలామణి చేయాలని నిర్ణయించారు. ఇందుకు వారు పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ అలియాస్ షేక్ అలియాస్ అన్వర్, బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫ్ షేక్‌తో పాటు దుబాయ్‌లో ఉండే మరికొంత మంది సాయం తీసుకున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి పార్శిళ్ల ద్వారా నకిలీ నోట్లను పంపి, అక్కడ తమ బృందంలోని వారితో నోట్లను పంపిణీ చేయించే వారు. రూ.1 లక్ష నకిలీ నోట్లు పంపిణీ చేస్తే, వీరికి రూ.50 వేలు అసలైన నోట్లు ఇచ్చే వారు.
మోర్జన్ హుస్సేన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులతో కలసి నకిలీ నోట్లను చలామణి చేస్తున్న సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ.. వారి ఫోన్ సంభాషణలను కేంద్రం అనుమతితో రికార్డ్ చేసింది. దీంతో హుస్సేన్‌ను బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో 2012లో అరెస్ట్ చేశారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల ఆధారంగా మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జాతీయులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. వీరితో పాటు మొత్తం 28 మందిని నిందితులుగా చేర్చిన ఎన్‌ఐఏ.. ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. విచారణ అనంతరం నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ 2015లో తీర్పునిచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ శిక్ష పడిన వారిలో ముగ్గురు హైకోర్టులో వేర్వేరుగా అదే ఏడాది అప్పీళ్లు దాఖలు చేశారు.
ఈ అప్పీళ్లపై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏటీఎం రంగరామానుజం.. ఎన్‌ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.విష్ణువర్దన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేందుకు పాక్ ప్రతీ రోజూ రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు అక్రమ పద్ధతుల్లో నకిలీ నోట్లను దేశంలోకి తీసుకొస్తోందని, ప్రస్తుత కేసులో కూడా నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారని, తద్వారా వచ్చిన నిజమైన డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని విష్ణువర్దన్‌రెడ్డి వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ, దోషుల అప్పీళ్లను కొట్టేసింది.