
నైజీరియన్ల ‘నయా’వంచన
లాటరీ తగిలిందంటూ ఎస్సెమ్మెస్ పంపి... ఆస్తి అప్పగిస్తామంటూ ఈ-మెయిల్ చేసి... ఉద్యోగం దొరికిందంటూ సంప్రదించి...
- ఆధునిక పంథాలో పంజా విసిరిన నల్లజాతీయులు
- సహకరిస్తున్న ఉత్తరాదికి చెందిన కొందరు యువకులు
- దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ద్వారా టోకరా
- ఆరుగురిని అరెస్టు చేసిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: లాటరీ తగిలిందంటూ ఎస్సెమ్మెస్ పంపి... ఆస్తి అప్పగిస్తామంటూ ఈ-మెయిల్ చేసి... ఉద్యోగం దొరికిందంటూ సంప్రదించి... ఇప్పటి వరకు ఇలాంటి చర్యల ద్వారానే సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్లు తమ పంథా మార్చారు. పోలీసులు కూడా అవాక్కయ్యే రీతిలో వ్యవస్థీకృతంగా ‘నయా’వంచనకు పాల్పడ్డారు. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో పంజా విసిరి రూ.కోట్లల్లో కొల్లగొట్టిన ముఠాకు చెందిన ఆరుగురిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఐదుగురు నైజీరియన్లు కాగా, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. అదనపు కమిషనర్ సందీప్‌శాండిల్య, సంయుక్త కమిషనర్ బి.మల్లారెడ్డి, క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజుతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు.
అద్దె ఇంటి నుంచి కరెంట్ ఖాతా వరకు...
నైజీరియన్లతో జట్టు కడుతున్న ఉత్తరాదికి చెందిన కొందరు యువకులు అనేక విధాలుగా సహకరిస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి బ్యాంక్ ఖాతాలు తెరవడం, సిమ్‌కార్డులు కొనుగోలు చేయడం, సంప్రదింపులు జరపడంలాంటి సాయం చేసిపెడుతున్నారు. ముఠాలకు నేతృత్వం వహిస్తున్న నైజీరియన్లు వీరికి కొంత మొత్తం ఇచ్చి పంపిస్తున్నారు. ఓ నగరానికి చేరుకున్న తరవాత ఆయా గుర్తింపుకార్డుల్ని చూపిస్తున్న వీరు వ్యాపారం కోసం వచ్చామంటూ ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు.
బ్యాంకుల పేరుతోనే నకిలీ సైట్స్ సృష్టించి...
వివిధ బ్యాంకుల పేర్లను పోలిఉండే యూఆర్‌ఎల్స్‌తో వెబ్‌సైట్స్ రూపొందిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే కొన్ని సంస్థల ద్వారా సేకరించిన ఈ-మెయిల్ ఐడీలకు వీటిని వినియోగించి ఒకేసారి భారీగా మెయిల్స్ పంపుతున్నారు. ఈ-మెయిల్స్ రిసీవ్ చేసుకున్న వారిలో సదరు బ్యాంక్ ఖాతా కలిగిన వారుంటే ఓపెన్ చేస్తున్నారు. ఈ బోగస్ వెబ్‌సైట్ సైతం అసలు దాని మారిదిగానే ఉండటంతో బాధితులు మోసపోయి అందులో కోరిన వివరాలను నింపేస్తున్నారు. ఇలా ఖాతాదారుడికి చెందిన పూర్తి సమాచారం నేరగాళ్లకు చేరిపోతోంది.
సాంకేతిక దర్యాప్తుతో పట్టిన సీసీఎస్...
ఈ పంథాలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, తమిళనాడు, గుజరాత్‌ల్లో అనేక మందిని ముంచి రూ.కోట్లలో స్వాహా చేసిన ముఠాను సాంకేతిక దర్యాప్తు ద్వారా సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో సంఘ్వీ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ కైలాష్‌నాథ్ సేథ్ తన ప్రమేయం లేకుండా తన ఖాతా నుంచి రూ.5 లక్షలు కాన్పూర్‌కు చెందిన విక్రమాదిత్య అనే వ్యక్తి ఖాతాలోకి ఆర్‌టీజీఎస్ ద్వారా బదిలీ అయ్యాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ క్రమంలో వాడిన నాలుగు ఫోన్ నెంబర్లను గుర్తించారు.
ఈ ఫోన్‌ల ఐఎంఈఐ నెంబర్లను విశ్లేషించగా ఇప్పటి వరకు ఈ నాలుగింటిలో 154 సిమ్స్ వేసి వాడారని తేలింది. దర్యాప్తు చేసిన అధికారులు కాన్పూర్‌కు చెందిన జైదీప్ పట్వర్థన్ పాత్రను అనుమానించారు. అతడు బెంగళూరులో ఉన్నాడని గుర్తించిన ప్రత్యేక బృందం వలపన్ని అతడితో పాటు సూత్రధారులైన నైజీరియన్లు సునే ఒఛే ఒజామా, మైఖేల్ అనింబా, ఒనియెగ్‌బునా ఒడోచుక్కు, నవాంజోండి అమేజీ ఒబేద్, టినైల్ యూసుఫ్ ఒలాతుంగిలను 5న అరెస్టు చేశారు. ఈ ఆరుగురినీ శుక్రవారం కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ల్యాప్‌టాప్స్‌లో 100 ఖాతాల వివరాలు...
ఈ నిందితుల నుంచి పోలీసులు రెండు ల్యాప్‌టాప్స్, మూడు డేటా కార్డులు, ఆరు ఫోన్లు, 20 సిమ్‌కార్డులు, ఓ కారుతో పాటు మూడు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 100 మంది ఖాతాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని గుర్తించారు. ఓటీజీఎస్ ద్వారా స్వాహాకు సిద్ధపడిన మరో రూ.61 లక్షలున్న బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ ముఠా నెల రోజుల్లో నగరంలోని వివిధ బ్యాంకుల్లో 38 ఖాతాలు తెరినట్లు గుర్తించారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు వీరు వాంటెడ్‌గా ఉండటంతో వారికి అరెస్టుపై సమాచారం ఇవ్వనున్నారు. విచారణ తరవాత స్వాహా అయిన మొత్తం తెలుస్తాయని కొత్వాల్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు.