ఇంటర్నెట్ లో మాయగాళ్లు
సాక్షి,హైదరాబాద్: ‘కంగ్రాట్స్ మా సంస్థ మిమ్మల్ని అవార్డు గ్రహీతగా ఎంపిక చేసింది. విదేశాల్లో జరిగే పసందైన వినోద కార్యక్రమంలో పాల్గొనేందుకు సంస్థ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తాం’ ఇటీవల నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మెయిల్‌కు వచ్చిన సందేశం ఇది. ‘లండన్‌లోని ఓ ధనవంతురాలికి సంతానం లేదు. ఆమె మిమ్మల్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇక ఆమె ఆస్తికి మీరే వారసులు’ ఇది ఓ ప్రైవేట్ ఉద్యోగికి వచ్చిన సందేశ సారాంశం.
‘మీకు ఐదు కోట్ల రూపాయల విలువైన అంతర్జాతీయ లాటరీ తగిలింది. ఆ మొత్తం పొందడానికి సంస్థ నిబంధనల మేరకు రూ.60 వేలు ముందుగా చెల్లిస్తే చాలు’ అన్న సందేశం మరో యువకుడి మెయిల్‌లో ప్రత్యక్షమైంది.
ఇలాంటి సందేశాలను చూసి ముందూ వెనుకా ఆలోచించకుండా కొందరు అందిన చోటల్లా అప్పులు చేసి ఈ-మెయిల్‌లో పేర్కొన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. వారం రోజులు ఎదురు చూసినా ఎటువంటి సమాచారం అందకపోవడంతో వివరణ కోరుతూ మెయిల్ వచ్చిన చిరునామాకు లేఖ పంపా రు. అయినా సమాధానం లేదు. అప్పుడు తాను మోసపోయానని గ్రహించి ఘొల్లుమన్నారు. ఇలాంటి హై టెక్ మోసాలు చేసేందుకు కొన్ని వ్యవస్థీకృత ముఠాలు ఏర్పడ్డాయి. ‘ఈ-మాయగాళ్లు’ వ్యవహారం తెలియక అనేక మంది అమాయక ప్రజలు తాము సంపాదించిన సొమ్మును చేజేతులా పోగొట్టుకుంటున్నారు.
సెల్‌ఫోన్లలోనూ..
నిత్య జీవనంలో తప్పనిసరి వస్తువుగా మారిన సెల్‌ఫోన్లు కూడా ఈ కేటుగాళ్లకు వరంలా మారిపోయాయి. పలు ఆకర్షణీయ బహుమతులున్నాయని నచ్చిన వారితో స్నేహం చేసే వీలుంటుందని ఆకర్షిస్తూ భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రజల సొమ్మును కాజేసేందుకు నకిలీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. నగరంలో గతంలో జరిగిన ఇలాంటి మోసాలకు మూలం నైజీరియన్, ఉత్తరాదికి చెందిన ముఠాలని సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. పోలీసులు ఇలాంటి మోసగాళ్లకు చెక్ పెడుతున్నా అక్కడక్కడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన.