‘దానం పెత్తనం వద్దు
ఏఐసీసీ ముందు పేచీ పెట్టిన రంగారెడ్డి నేతలు
సిటీబ్యూరో: ‘ మాపై ఇతర నాయకుల పెత్తనం వద్దే వద్దు. బలవంతంగా దానం నాగేందర్ ఇతర నాయకులను రుద్ది మమ్మల్ని పార్టీకి దూరం చేయొద్దు. స్థానికంగా బలం, పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకులకు న్యాయం చేసే విధంగా వ్యవహరించండి’ అంటూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఏఐసీసీకి నేతలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో ఎంఎల్‌ఏ రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఏలు సుధీర్‌రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రసాద్‌కుమార్, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్‌లతో పాటు ఆయా నియోకవర్గాల నాయకులు బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.
వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ నగర కమిటీ, రంగారెడ్డి జిల్లా కమిటీలను వేర్వేరుగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని, తాము హైదరాబాద్ నగర కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ ఆధ్వర్యంలో పని చేయలేమని వారు తేల్చి చెప్పారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బూత్, డివిజన్ స్థాయి కార్యకర్తల ఆమోదం మేరకు నియోజకవర్గాల బాధ్యులు అభ్యర్థులను సూచిస్తారని రంగారెడ్డి నేతలు చేసిన ప్రతిపాదనకు దిగ్విజయ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం నియోకజవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్‌రెడ్డి రాంరెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని వారు దిగ్విజయ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేయగా, పీసీసీ అధ్యక్షుడితో చర్చిస్తానని హామీ ఇచ్చారు.