కంటి ఆస్పత్రి ఖాళీ
- ‘సరోజినీ’లో చికిత్సకు ముందుకు రాని రోగులు
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్లు వికటించిన విషయం వెలుగుచూడడంతో రోగులు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లేందుకు జంకుతున్నారు. క్యాటరాక్ట్ శస్త్రచికిత్స వికటించి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఐదుగురు బాధితులు మినహా ఇన్‌పేషెంట్ వార్డుల్లో మరెవరూ కన్పించడం లేదు. ఆస్పత్రి చరిత్రలో ఈ పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదు. కంటిచూపు మందగించడంతో గతనెల 30న ఆస్పత్రిలో 21 మంది క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోగా.. వారిలో ఏడుగురు కంటిచూపును కోల్పోయిన విషయం తెలిసిందే. కళ్లను శుభ్రం చేసే రింగర్ లాక్టిటెట్(ఆర్‌ఎల్) సెలైన్ బాటిల్లోనే కాకుండా ఆపరేషన్ థియేటర్‌లోని వైద్య పరికరాల్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని భావించిన అధికారులు ఈ నెల 1న ఎమర్జెన్సీ మినహా మిగిలిన ఏడు ఆపరేషన్ థియేటర్లను కూడా మూసేశారు. గత ఏడు రోజుల నుంచి ఎమర్జెన్సీకి వచ్చిన ఒకట్రెండు కేసులు మినహా.. ఇతర శస్త్రచికిత్స లేవీ జరగడం లేదు.
రోగుల్లో సన్నగిల్లిన నమ్మకం
సరోజినీదేవి కంటి ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రోజుకు సగటున 800 మంది వస్తుంటారు. 540 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 350-400 మంది చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 70-80 మంది కొత్త పేషెంట్లు అడ్మిట్ అవుతారు. రోజుకు 40-50 శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి.
అయితే ఆపరేషన్లు వికటించిన నేపథ్యంలో గురువారం అత్యవసర విభాగం సహా ఓపీ, ఐపీ వార్డులన్నీ రోగుల్లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇన్‌పేషెంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు కూడా వైద్యులపై నమ్మకం సన్నగిల్లింది. తమను ఇక్కడి నుంచి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి షిఫ్ట్ చేయాలని బాధితుడు అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులకు ఇప్పటివరకు చేయాల్సినదంతా చేస్తున్నామని, బయటి నుంచి నిపుణులను పిలిపించాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్‌గుప్తా పేర్కొన్నారు.
నిలోఫర్‌లో ‘ఫంగస్’ సెలైన్ బాటిళ్లు
తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) సరఫరా చేసిన రింగర్ లాక్టిటెట్(ఆర్‌ఎల్) సెలైన్ వాటర్ బాటిల్లో ‘క్లెబ్సియల్లా’ బ్యాక్టీరియా ఉన్నట్లు సరోజినీదేవి ఉదంతంతో తేలిన సంగతి తెలిసిందే. అదే కంపెనీకి చెందిన సెలైన్ బాటిల్లో ఫంగస్ ఉన్నట్టు వారం రోజుల కిందటే నిలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ టీఎస్‌ఎంఐడీసికి లేఖ రాసినా అధికారులు స్పందించలేదు. తాజాగా సరోజినీదేవి ఆసుపత్రిలో బ్యాక్టీరియా వెలుగుచూడడంతో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు గురువారం హడావుడిగా నిలోఫర్ ఆసుపత్రికి చేరుకొని 29 వేల సెలైన్ బాటిళ్లను సీజ్ చేశారు. ఈ ఆసుపత్రికి 38 వేల సెలైన్ బాటిళ్లు సరఫరా చేయగా.. వాటిలో ఇప్పటికే 9 వేల బాటిళ్లు ఉపయోగించారు.
కంపెనీని వదిలి.. డాక్టర్లపై చర్యలా: టీజీడీఏ
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనకు వైద్యులను బాధ్యులుగా చేయడం తగదని తెలంగాణ వైద్యుల సంఘం( టీజీడీఏ) ఉస్మానియా యూనిట్-2 ప్రతినిధులు డాక్టర్ రవీందర్‌గౌడ్, డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్, డాక్టర్ వినోద్‌కుమార్ లు స్పష్టంచేశారు. సరఫరా చేసిన కంపెనీని, నాణ్యతను పరిశీలించకుండా కొనుగోలు చేసిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులను వదిలి వైద్యులపై చర్యలు తీసుకోవాలని చూడటం సమంజసం కాదన్నారు. మందుల కొనుగోళ్లు, వాటి నాణ్యతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.