కారులో గొడవ.. ఆపై కత్తులతో దాడి
హైదరాబాద్ : సికింద్రాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగి సంజయ్ జుంగీ హత్యను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం ఛేదించారు. ఈ హత్యతో ప్రమేయం ఉందన్న అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితులను ఆదివారం సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్ ఈ ఘటన వివరాలను వివరించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంజయ్ జుంగీ హైటెక్ సిటీలో విధులు ముగించుకుని గురువారం అర్థరాత్రి ఇంటికి బయలుదేరాడు. ఆ తర్వాత కూకట్పల్లి వెళ్లి అక్కడ స్నేహితులతో కలసి పార్టీ చేసుకున్నాడు. అక్కడి నుంచి స్నేహితుడి బైక్పై పంజాగుట్టకు చేరుకున్నాడు. క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో పాత బస్తీ వెళ్తున్న క్యాబ్ ను సంజయ్ ఆపి లిఫ్ట్ అడిగాడు.
కారులో నిందితులు, సంజయ్ గొడవపడ్డారు. ఇంతలో సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ స్టాప్ రావడంతో సంజయ్ కారు దిగిపోయాడు. అప్పటికే సంజయ్పై ఆగ్రహంతో ఉన్న వారు.. కత్తులతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై దాడిచేశారు. దీంతో సంజయ్ నడిరోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడని నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్ వివరించారు. ఆ వెంటనే తమ కారులో నిందితులు అక్కడి నుంచి ఓల్డ్ సిటీ వైపు పరారైయ్యారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులు ప్రయాణించిన కారు నంబర్ గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు నంబర్ ట్రేస్ చేసి నిందితులను కనిపెట్టి శనివారం నాడు టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని అరెస్ట్ చేసినట్లు ఈ సందర్భంగా నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను అభినందించారు.