కారులో వచ్చి.. కత్తిపోట్లు | software engineer murdered in hyderabad | Sakshi
Sakshi News home page

కారులో వచ్చి.. కత్తిపోట్లు

Published Fri, Mar 4 2016 2:55 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

కారులో వచ్చి.. కత్తిపోట్లు - Sakshi

కారులో వచ్చి.. కత్తిపోట్లు

హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. పోలీసులు గస్తీ వాహనంలో వెంబడించినా చిక్కకుండా పరారయ్యారు. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద గురువారం తెల్లవారుజామున నడిరోడ్డుపై ఈ దారుణం చోటుచేసుకుంది. సీసీటీవీల ఆధారంగా ఆ కారు నంబర్‌ను గుర్తించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా లేదా వ్యక్తిగత కక్షలు ఈ హత్యకు దారితీశాయా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.

 అంధ విద్యార్థి పరీక్షకు సాయంగా వెళ్లి..
 సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన సురేందర్, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు సంజయ్ జుంగే (25) ఈఈఈ పూర్తి చేసి ఏడాది క్రితమే మణికొండలోని సదర్‌ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఓ అంధ విద్యార్థికి సాయంగా పరీక్ష రాయడానికి వెళ్తున్నానంటూ సంజయ్ బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. పరీక్ష రాసిన అనంతరం తన సంస్థలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిప్ట్ డ్యూటీ చేశాడు. తర్వాత సహోద్యోగులు కుశాల్కర్, సిద్ధాంత్‌లతో కలిసి మియాపూర్‌లోని సిద్ధాంత్ గదికి వెళ్లాడు. ఈ ముగ్గురూ గురువారం తెల్లవారుజాము వరకు మద్యం తాగారు. అనంతరం బైక్‌పై వారంతా పంజగుట్టలోని పీవీఆర్ మాల్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ వాహనం దిగిన సంజయ్.. తాను ఇంటికి వెళ్తానని చెప్పడంతో మిగతా ఇద్దరు స్నేహితులు వెళ్లిపోయారు. అక్కడ్నుంచి సంజయ్ బేగంపేట్‌లో ఉండే స్నేహితుడు భాస్కర్‌కు ఫోన్ చేసి.. క్యాబ్‌లో వస్తానని, ప్యారడైజ్ వద్ద పికప్ చేసుకోవాలని కోరాడు. చివరగా తెల్లవారుజామున 5.13 గంటలకు భాస్కర్ తో మాట్లాడాడు.

 రెండు నిమిషాల్లోనే ఘాతుకం
 సంజయ్ నడుచుకుంటూ స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే.. ఓ స్విఫ్ట్ డిజైర్ కారు వచ్చింది. సంజయ్ రోడ్డు దిగి పక్కకు జరగ్గా..  కాస్త ముందుకు వెళ్లి కారు ఆగింది. అందులోంచి ముగ్గురు వ్యక్తులు సంజయ్ వద్దకు వచ్చి పెనుగులాడారు. అందులో ఒకరు కత్తితో సంజయ్ ఛాతీపై పొడిచాడు. దీంతో కుప్పకూలిన సంజయ్ అక్కడికక్కడే మరణించాడు. ఉదయం 5.15 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

 ‘హిట్ అండ్ రన్’ అనుకున్న పోలీసులు
 సంజయ్‌ను హత్య చేసిన దుండగులు అదే కారులో ప్యారడైజ్ వైపు పారిపోతుండగా.. అదే సమయంలో మహంకాళి పోలీసుస్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం వీరి వాహనానికి ఎదురు వచ్చింది. కారు అతి వేగంతో దూసుకు వెళ్తుండటం.. కొద్దిదూరంలోనే ఓ వ్యక్తి (సంజయ్) కిందపడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ వ్యక్తిని ఢీకొట్టి పారిపోతున్నారని (హిట్ అండ్ రన్) భావించి ఆ కారును వెంబడించారు. వెనక్కు తిరిగి ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు దుండగుల కారును వెంబడించారు. అయితే దుండగులు 130 నుంచి 140 కి.మీ. స్పీడుతో వెళ్లి పోలీసులకు చిక్కలేదు. అనంతరం ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు హత్య జరిగినట్లు గుర్తించి కారుకు సంబంధించిన ఆచూకీ కనిపెట్టాలంటూ అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు.

 దొరకని కారు..: మిత్రుడితో క్యాబ్‌లో వస్తున్నానని సంజయ్ చెప్పిన నేపథ్యంలో నగరంలోని అన్ని క్యాబ్ సర్వీసుల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సంజయ్ ఒకవేళ హంతకుల కారులోనే ప్రయాణించాడా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. హంతకులు పారిపోయిన తెలుపు రంగు కారు నంబర్ ‘8055’ను ‘బాస్’ మోడల్‌లో రాసినట్లు సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా గుర్తించారు. నగరంలో ఆ నంబర్‌తో 14 కార్లు ఉండడంతో వాటి యజమానులను ప్రశ్నిస్తున్నారు. సంజయ్ సహోద్యోగులు, స్నేహితులతో పాటు అతడి కాల్ వివరాలు ఆధారంగా విచారణ చేస్తున్నారు. మృతుడి దేహంపై ఉన్న కత్తిగాట్లను పరిశీలించిన పోలీసులు ఈ హత్య ప్రొఫెషనల్స్ పనిగా అనుమానిస్తున్నారు.

 రక్షించమని అరిచాడు
 ‘‘హత్య జరిగిన సమయం లో నేను విధుల్లో ఉన్నా. సంజయ్ వెనుక నుంచి కారు తో వచ్చిన దుండగులు హారన్ కొట్టారు. సంజయ్ పక్కకు జరగ్గానే ముగ్గురు బయటకు దిగి అతనితో గొడవ పడ్డారు. అందులో ఒకడు కత్తితో దాడి చేశాడు. సంజయ్ ‘బచావో బచావో’ అంటూ అరిచాడు. అంతలోనే దుండగులు కారులో పరారయ్యారు’’
 - మనోహర్, ప్రత్యక్ష సాక్షి
 (సెక్యూరిటీ గార్డు)

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement