మరదలిపై కన్నేసి తోడల్లుడిని చంపించాడు! | Bangalore police have arrested the Hyderabad Software Engineer | Sakshi
Sakshi News home page

మరదలిపై కన్నేసి తోడల్లుడిని చంపించాడు!

Published Sat, Feb 22 2020 2:01 AM | Last Updated on Sat, Feb 22 2020 5:00 AM

Bangalore police have arrested the Hyderabad Software Engineer - Sakshi

లక్ష్మణ్‌కుమార్‌ హత్యకేసులో పట్టుబడిన నిందితులు, మృతుడు లక్ష్మణ్‌కుమార్‌ (ఇన్‌సెట్‌లో)

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరులో ఈ నెల మొదటి వారంలో చోటు చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లక్ష్మణ్‌కుమార్‌ హత్య కేసులో అక్కడి పోలీసులు నగరానికి చెందిన హతుడి బంధువైన మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సత్యప్రసాద్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. మరదలిపై కన్నేసిన సత్యప్రసాద్‌ ఆమెను దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే తోడల్లుడిని చంపించినట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. ఇందుకుగాను హైదరాబాద్‌లో నివసిస్తున్న బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్‌ డ్రైవర్‌కు రూ.15 లక్షల సుపారీ ఇచ్చినట్లు బెంగళూరులోని మహదేవ్‌పుర పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అశ్విత్‌ నారాయణస్వామి ‘సాక్షి’కి ఫోన్‌ ద్వారా తెలిపారు. ‘లక్ష్మణ్‌ ఫొటోలను ఫేస్‌బుక్‌ నుంచి సేకరించిన సత్య... అతడి లోకేషన్స్‌ను వాట్సాప్‌ ద్వారా దీపక్‌కు పంపాడని గుర్తించామని, ఈ కేసుకు సంబంధించి మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు’ఆయన వివరించారు. రెండు దఫాల్లో ఈ అరెస్టులు జరిగాయని, సత్యప్రసాద్‌ను మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. 

మరదలిపై కన్నేసి...
నెల్లూరుకు చెందిన సత్యప్రసాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ఇతడికి 2006లో గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు మాదాపూర్‌లో ఉంటూ వేర్వేరు కంపెనీల్లో పని చేస్తున్నారు. సత్య భార్య సోదరి శ్రీజకు గుంటూరుకు చెందిన లక్ష్మణ్‌కుమార్‌తో 2016లో వివాహం జరిగింది. ఆమె కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో ప్రస్తుతం భార్యభర్తలు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా శ్రీజపై కన్నేసిన సత్య ఆమెను లోబరుచుకోవాలని భావించాడు. ఈ విషయం మరదలి కి కూడా చెప్పని అతను లక్ష్మణ్‌ కుమార్‌ను హత్య చేస్తే ఆమె తనకు సొంతమవుతుందని భావిం చాడు. దీంతో పలుమార్లు బెంగళూరు వెళ్లిన సత్య హత్యలు చేసే ముఠాల కోసం ప్రయత్నించాడు. లక్ష్మణ్‌ ఇల్లు, కార్యాలయానికి సంబంధించిన లోకేషన్స్‌ను తన వాట్సాప్‌లో సేవ్‌ చేసుకున్నాడు. 

ఫేస్‌బుక్‌ నుంచి ఫొటో డౌన్‌లోడ్‌ చేసి...
సుపారీ తీసుకుని రంగంలోకి దిగిన దినేష్‌.. సత్య నుంచి లక్ష్మణ్‌ పొటో, ఇతర వివరాలను తీసుకున్నాడు. గత జూలై 16న బెంగళూరు వెళ్లిన దినేష్‌.. లక్ష్మణ్‌పై దాడి చేశాడు. మెడపై కత్తితో దాడి చేసినా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనిపై స్థానిక హెన్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ తర్వాత దినేష్‌ హైదరాబాద్‌కు వచ్చేయడంతో కేసు పెండింగ్‌లోనే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నెలలో లక్ష్మణ్‌ను ఎట్టి పరిస్థితుల్లో హత్య చేయాల్సిందిగా సత్య ఒత్తిడి చేయడంతో తన భార్యతో కలసి గత నెల రెండో వారంలో బెంగళూరు వెళ్లిన దినేష్‌ అక్కడి దేవనహల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు. మరోసారి ఫేస్‌బుక్‌ నుంచి లక్ష్మణ్‌ ఫొటోను డౌన్‌లోడ్‌ చేసిన సత్య దానిని దినేష్‌కు పంపాడు. అయితే లక్ష్మణ్‌ తన తోడల్లుడనే విషయాన్ని మాత్రం దినేష్‌కు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. 

మరో ఏడుగురితో కలసి హత్య...
బెంగళూరులోని పలు ప్రాంతాలకు చెందిన స్నేహితులు ప్రశాంత్, ప్రేమ్, లోకేష్, కుష్వంత్, సంతోష్, రవిలను దినేష్‌ తనతో కలుపుకున్నాడు. 2 కార్లు, 4 బైక్‌లతో రంగంలోకి దిగిన ఈ ముఠా గత నెల 30, 31 తేదీల్లో లక్ష్మణ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నెల 3న లక్ష్మణ్‌ ఇంటి వద్ద కాపుకాసిన ఈ గ్యాంగ్‌ అతడు ఆఫీస్‌కు బయలుదేరినప్పటి నుంచి వెంబ డించింది. మహదేవ్‌పుర ఫ్లైఓవర్‌ వద్ద అతడిని అడ్డగించి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న సత్య ఏమీ ఎరుగనట్లు తన భార్యను తీసుకుని హుటాహుటిన బెంగళూరు వెళ్లాడు. లక్ష్మణ్‌ హత్య కేసుకు సంబంధించి మహదేవ్‌పుర ఠాణాలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ప్రతి ని కూడా అతడే తీసుకున్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రశాంత్, ప్రేమ్‌ తదితరులను అరెస్టు చేశారు. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలతో రాజేంద్రనగర్‌కు వచ్చి దినేష్, సవిత ను అదుపులోకి తీసుకున్నారు. తనకు సత్య సుపారీ ఇచ్చాడని దినేష్‌ చెప్పడంతో మంగళవారం రాత్రి మాదాపూర్‌కు వచ్చిన మహదేవ్‌పుర పోలీసులు అతడినీ అరెస్టు చేసి తీసుకువెళ్లారు. 

క్యాబ్‌ డ్రైవర్‌కు సుపారీ ఇచ్చి...
బెంగళూరులోని బోయప్పనహల్లి ప్రాంతానికి చెందిన దినేష్‌ కొన్నేళ్ల క్రితం అక్కడి సయీదాని ప్రేమించాడు. వీరి పెళ్లికి ఆమె కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఆమెను హైదరాబాద్‌ తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. సవితగా ఆమె పేరు మార్చి రాజేంద్రనగర్‌ బండ్లగూడలోని వికాస్‌నగర్‌ కాలనీలో ఉంటూ క్యాబ్‌డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఇతను సత్యప్రసాద్‌ పని చేస్తున్న కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు. అప్పట్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దినేష్‌ గురించి తెలుసుకున్న సత్య తన తోడల్లుడు లక్ష్మణ్‌ను చంపడానికి సుపారీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన శత్రువు ఒకరు బెంగళూరులో ఉంటున్నాడని దినేష్‌తో చెప్పిన సత్య అతడిని హత్య చేస్తే రూ.15 లక్షలు, హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్‌ కొనిస్తానని ఆఫర్‌ ఇచ్చాడు. ఇందుకు అంగీకరించిన దినేష్‌ ముందుగా రూ.1.5 లక్షల అడ్వాన్స్‌ తీసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement