సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని టేకుపల్లి మండలంలో జరిగిన దారుణ ఘటన.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అశోక్(24) దారుణ హత్య కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడనే కారణంతో అతన్ని గొంతు కోసి, నరికి చంపారు దుండగులు. దీంతో ముత్యాలంపాడు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ముత్యాలంపాడు క్రాస్ రోడ్‌కు చెందిన ప్రేమ్ కుమార్‌కు రూ. 80 వేలు అప్పు ఇచ్చాడు ధారావత్ అశోక్. ఈ వ్యవహారంలో మరో మధ్వవర్తి కూడా ఉన్నాడు. అయితే తిరిగి ఆ డబ్బు ఇవ్వమని అడగడంతో.. కక్ష పెంచుకుని హత్యకు ప్లాన్ వేశారు. శనివారం రాత్రి అప్పు తీరుస్తాం రమ్మంటూ పిలిచి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అశోక్ తండ్రి బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ. అయితే తన కొడుకు హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు అశోక్‌కు ఏడాది కిందటే వివాహం అయ్యింది. నెలల పాప ఉంది. దీంతో ఒళ్లో పసికందుతో అశోక్ భార్య కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. అశోక్‌ను చంపిన వాళ్లను శిక్షించి.. తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతోందామె. తన భర్తను దూరం చేసి.. చిన్న వయసులో తన జీవితాన్ని ఇలా మార్చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, పోలీసుల వల్ల కాకపోతే తమ ఎదుటకు తీసుకొస్తే తామే శిక్షిస్తామని ఆక్రోశంతో నిండిన ఆవేదనను వెల్లగక్కింది ఆమె. ఇదిలా ఉంటే.. హత్యపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని అంటోందామె. ఒక్కడి వల్లే ఈ హత్య సాధ్యం కాదని, ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది.
గ్రామస్థులు కూడా అశోక్ శారీరకంగా ధృడమైన మనిషిని అని, ప్రతిఘటించే అవకాశం కావడంతో.. ఈ హత్యలో తమకూ అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఈ హత్యకు గ్రామంలో ఉండే గంజాయి బ్యాచ్‌కు సంబంధం ఉందన్న భావిస్తున్నారు వాళ్లు. మరోవైపు ఇది రూ. 80 వేల వ్యవహారమేనా? హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment