సాక్షి, జగిత్యాల/మల్యాల (చొప్పదండి): హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాచర్ల పవన్ కుమార్‌ను పథకం ప్రకారం అతని బంధువులే హత్య చేశారని మల్యాల సీఐ కిశోర్ తెలిపారు. కుటుంబ కలహాలు, మంత్రాల నెపంతోనే ఈ దారుణం జరిగిందన్నారు. ఈ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పవన్ కుమార్ (38)పై సోమవారం రాత్రి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన విషయం విదితమే.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన పవన్ కుమార్.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్‌కు అక్కడ వివాహేతర సంబంధం ఉందని భార్య కృష్ణవేణికి అనుమానం రావడంతో ఇరువురి మధ్య స్పర్ధలు చోటుచేసుకున్నాయి. దీంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ విషయం కృష్ణవేణి తన సోదరులు రాపర్తి విజయ్‌బాబా, రాపర్తి జగన్, ఇతర కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పవన్‌తో గొడవకు దిగారు. కోపోద్రిక్తుడైన పవన్.. బావమరిది జగన్‌ను నెలరోజుల్లో చంపేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో జగన్ ఈ నెల 12వ తేదీన గుండెపోటుతో మరణించాడు. (చదవండి : మంత్రాల నెపంతో సజీవదహనం)
అయితే.. పవన్ మంత్రాలు చేయడం వల్లే తన భర్త మృతి చెందాడని భావించిన జగన్ భార్య సుమలత.. పవన్ కుమార్‌ను హత్య చేయాలని పథకం వేసింది. రాపర్తి విజయ్, భార్య భవాని, తల్లి ప్రమీల, పవన్ కుమార్ భార్య కృష్ణవేణి, అక్క రాందేని స్వరూపతో కలసి ప్రణాళిక రూపొందించింది. కాగా, జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బల్వంతాపూర్‌కు చేరుకున్నాడు. జగన్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని పవన్ కుమార్‌ను పథకం ప్రకారం గదిలోకి పంపి డోర్ వేశారు. అప్పటికే తెచ్చుకున్న 20 లీటర్ల పెట్రోల్‌ను కిటికీలో నుంచి అతనిపై పోసి నిప్పంటించడంతో సజీవ దహనం అయ్యాడు. (సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సజీవ దహనం చేసిన అత్తింటివారు)
ఏడుగురి రిమాండ్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పవన్ కుమార్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి నట్లు మల్యాల సీఐ కిశోర్, ఎస్సై నాగరాజు మంగళవారం తెలిపారు. మృతుడు జగన్ భార్య సుమలత, రాపర్తి విజయ్, భార్య భవాని, తల్లి ప్రమీల, పవన్ కుమార్ భార్య కృష్ణవేణి, అక్క రాందేని, కొండగట్టుకు చెందిన ఉప్పు నిరంజన్‌లను రిమాండ్‌కు తరలించామని ఆయన వివరించారు.
మరో బావమరిదితోనూ వివాదం
ప్రముఖ క్షేత్రం కొండగట్టు సమీపంలోని బల్వంతాపూర్ శివారులో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాపర్తి విజయ్‌బాబా 12 ఏళ్ల క్రితం మూడెకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఇక్కడ మంజునాథ సహస్త్ర శివాలయాన్ని నిర్మించి, అక్కడే ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. కొన్ని నెలలుగా విజయ్‌బాబాకు బావ పవన్‌తో వివాదం నడుస్తోంది. కాగా మంగళవారం ఘటనాస్థలాన్ని ఎస్పీ సింధూ శర్మ పరిశీలించారు. ఇదిలాఉండగా.. తన కొడుకు పవన్ కుమార్‌ను పథకం ప్రకారమే హత్య చేశారని మృతుడి తండ్రి గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment