రోడ్డెక్కిన నర్సింగ్‌ విద్యార్థులు | Nursing students came out to the roads | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన నర్సింగ్‌ విద్యార్థులు

Published Sat, Jun 3 2017 3:00 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

రోడ్డెక్కిన నర్సింగ్‌ విద్యార్థులు

రోడ్డెక్కిన నర్సింగ్‌ విద్యార్థులు

- లాకౌట్‌ అయిన మెడ్విన్‌ ఆస్పత్రి.. విద్యార్థుల ఆందోళన
పోలీసులపై రాళ్లురువ్విన నర్సింగ్‌ విద్యార్థులు.. తీవ్ర ఉద్రిక్తత
ఇద్దరు ఫొటోగ్రాఫర్లు సహా పలువురికి గాయాలు
 
హైదరాబాద్‌: నాంపల్లిలోని మెడ్విన్‌ ఆస్పత్రి మూతపడటంతో లక్షల రూపాయలు చెల్లించిన నర్సింగ్‌ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్లురువ్వడంతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మూడు నెలలుగా మెడ్విన్‌ ఆస్పత్రి మూతపడటంతో అందులో నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థులు శుక్రవారం ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. హాస్టల్‌లో కరెంట్‌ నిలిపేస్తున్నారని, గదులు తెరవడంలేదని, మెస్‌ సౌకర్యం లేక కొన్ని రోజులుగా పస్తులుంటూ హోటళ్లలో తింటున్నామని, ప్రస్తుతం తమ వద్ద డబ్బులు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు.

సుమారు 2 గంటల పాటు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న అబిడ్స్‌ పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన విరమించాలని విద్యార్థులకు సూచించారు. యాజమాన్యంతో తాము చర్చిస్తా మని పోలీసులు హామీ ఇచ్చినా విద్యార్థులు వెనక్కితగ్గలేదు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులపై రాళ్లురువ్వారు. పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. దీంతో అక్కడ యుద్ధ వాతావ రణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు విద్యార్థులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. విద్యార్థుల ఆందోళనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన పలు పత్రికలకు చెందిన ఫొటోగ్రాఫర్లు సతీష్, సంజయ్‌చారితో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. నిరసనలో నర్సింగ్‌ విద్యార్థులు శ్రీను, సుష్మిత, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మూడు నెలలుగా పస్తులుంటున్నాం..
ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించి మెడ్విన్‌ ఆస్పత్రిలో నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్నామని నర్సింగ్‌ విద్యార్థులు చెబుతున్నారు. 250 మంది వద్ద లక్షలు వసూలు చేసిన ఆస్పత్రి యాజమాన్యం.. ఇప్పుడు ఆస్పత్రిని, మెస్‌ను తెరవకుండా తమను రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ కావూరి, ఆయన కుమార్తెలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చదువు మధ్యలో ఆగిపోవడంతో తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత నర్సింగ్‌ విద్యార్థులు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement