పాతబస్తీలో విద్యుత్ నష్టాలు 43.11%
♦ దక్షిణ డిస్కం సగటు నష్టాలు 11.14 శాతం
♦ చార్జీల పెంపు అభ్యంతరాలకు ఎస్పీడీసీఎల్ వివరణ
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని పాతబస్తీలో సమిష్టి విద్యుత్ సరఫరా, పంపిణీ, వాణిజ్య (యాగ్రిగేట్ ట్రాన్స్‌మిషన్ అండ్ కమర్షియల్: ఏటీ అండ్ సీ) నష్టాలు 43.11 శాతానికి పెరిగాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) పరిధిలోని 5 జిల్లాల్లో 10 సర్కిళ్లు ఉండగా, దక్షిణ హైదరాబాద్ సర్కిల్ పరిధిలో అసాధారణ రీతిలో 43.11 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలు నమోదయ్యాయి. మిగిలిన 9 సర్కిళ్ల పరిధిలో ఈ నష్టాలు 4.26 శాతం నుంచి 11.20 శాతం మధ్యలో ఉన్నాయి.
సరఫరా, పంపిణీ చేసింది మొత్తం విద్యుత్‌లో సాంకేతిక, వాణిజ్యపర లోపాలతో జరిగిన నష్టాలనే ఏటీ అండ్ సీ నష్టాలుగా పరిగణిస్తారు. విద్యుత్ చోర్యం, వసూలు కాని బిల్లులను వాణిజ్యపర నష్టాల కింద లెక్కిస్తారు. పాత నగరంలో వాణిజ్యపర నష్టాలు అధికంగా ఉండడం వల్లే ఏటీఅండ్‌సీ నష్టాలు విపరీతంగా పెరిగినట్లు ఎస్పీడీసీఎల్ చూపించింది. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాప్రభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలకు ఇచ్చిన వివరణల్లో సంస్థ యాజమాన్యం 2015-16 (గత ఏడాది డిసెంబర్ వరకు) ఏటీఅండ్‌సీ నష్టాలను బహిర్గతం చేసింది.
ఫిర్యాదు చేస్తే బిల్లులపై పునఃపరిశీలన...
విద్యుత్ బిల్లుల జారీలో జాప్యంతో శ్లాబ్‌లు మారిపోయి విద్యుత్ బిల్లులు పెరిగిపోయిన సందర్భంలో వినియోగదారులు ఫిర్యాదు చేస్తే పునఃపరిశీలించి సవరిస్తామని ఎస్పీడీసీఎల్ తెలిపింది. నెలకు 30, 31 రోజుల వినియోగానికి బిల్లు చేస్తామంది. ప్రతి నెలా 4 నుంచి 17వ తేదీ వరకు స్పాట్ బిల్లింగ్ నిర్వహిస్తుండడంతో 20 నుంచి 40 రోజుల వినియోగానికి సంబంధించిన బిల్లులను నెల రోజుల బిల్లుగా చార్జీ చేస్తున్నారని, దీంతో పేద, మధ్య తరగతి వినియోగదారుల వినియోగం 200 యూనిట్లకు మించిపోయి బిల్లు రూ.470 నుంచి రూ.1506 వరకు వస్తోందని న్యాయవాది వై.చంద్రశేఖర్‌రావు తెలిపిన అభ్యంతరంపై ఎస్పీడీసీఎల్ ఈ మేరకు హామీ ఇచ్చింది. విద్యుత్ సరఫరా సగటు వ్యయం 2015-16లో యూనిట్‌కు రూ.5.64 నుంచి రూ.6.44కు పెరగడంతో చార్జీలు పెంచక తప్పడం లేదని సమర్థించుకుంది.