ఫ్లాట్లు.. పాట్లు..
ప్రస్తుతం నిర్మిస్తున్న కొత్త అపార్ట్‌మెంట్.. ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన ఓ పాత అపార్ట్‌మెంట్.. ఈ రెండింటి ధరలను నిర్ణయించమంటే ఎవరాన్నా చేస్తారు..! కొత్త ఇంటికి ప్రస్తుత ధరను, పాత ఇంటికి తరుగుదల తగ్గించి తక్కువ ధరను నిర్ధారిస్తారు. కానీ, రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన ఇళ్లలో ఎవరూ కొననివాటికి ప్రస్తుత మార్కెట్ ధరను నిర్ణయించి అమ్మకానికి పెట్టింది. గతంలో వీటిని అమ్మబోతే.. ‘పాత ఇళ్లకు ఇంత ధరేంటి?’ అంటూ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఐదు నెలల విరామం ఇచ్చి మళ్లీ అవే ధరలతో అమ్మకానికి సిద్ధమైంది.
వేలంలో ఉంచిన ఇళ్లివే... | |||
కేటగిరీ | ఫ్లాట్ నెం. | విస్తీర్ణం (చ.అ.) | ధర (రూ.లలో) |
ఎంఐజీ (టూ బెడ్‌రూం) | ఎ8-302 | 1131 | 27,71,391 |
ఎంఐజీ (టూ బెడ్‌రూం) | ఎ48-302 | 1131 | 27,71,391 |
హెచ్‌ఐజీ (త్రీ బెడ్‌రూం) | సీ2-301 | 1442 | 37,49,616 |
హెచ్‌ఐజీ (త్రీ బెడ్‌రూం) | సీ8-101 | 1442 | 37,49,616 |
హెచ్‌ఐజీ (త్రీ బెడ్‌రూం) | సీ9-402 | 1442 | 37,49,616 |
డూప్లెక్స్ | డీ1-404 | 1766 | 48,56,940 |
డూప్లెక్స్ | డీ1-405 | 1934 | 53,18,995 |
డూప్లెక్స్ | డీ1-505 | 1934 | 53,18,995 |
డూప్లెక్స్ | డీ2-303 | 1766 | 48,56,940 |
డూప్లెక్స్ | డీ2-501 | 1711 | 47,05,663 |
డూప్లెక్స్ | డీ4-206 | 1711 | 47,05,663 |
డూప్లెక్స్ | డీ4-504 | 1766 | 48,56,940 |
పెంట్‌హౌస్ | సీ4-901 | 2218 | 67,66,120 |
పెంట్‌హౌస్ | సీ5-903 | 2235 | 68,19,099 |
పెంట్‌హౌస్ | సీ8-904 | 2235 | 68,19,099 |
నగర శివారు పోచారంలో 2005లో నిర్మించిన సింగపూర్ టౌన్‌షిప్ (సంస్కృతి టౌన్‌షిప్)లో ఖాళీగా ఉన్న 15 ఇళ్లను తాజాగా గృహ నిర్మాణ మండలి అమ్మకానికి పెట్టింది. ఎంఐజీ, హెచ్‌ఐజీల్లోని రెండు బెడ్‌రూములు, మూడు బెడ్‌రూమ్ ఫ్లాట్లతోపాటు డూప్లెక్స్, పెంట్‌హౌస్‌లు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని గత మార్చిలో బహిరంగ వేలం ద్వారా అమ్మేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా, ధరలు చాలా ఎక్కువని ఒక్కరూ ముందుకు రాలేదు. సమీపంలోని ప్రైవేట్ వెంచర్ల కంటే ఈ పాత ఇళ్ల ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు అధికారుల దృష్టికి తెచ్చారు.
దీంతో ఆ ధరలను ఏమేరకు తగ్గించగలుగుతారో పరిశీలించాలని గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి బోర్డును ఆదేశించారు. కానీ అధికారులు అవే ధరలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. నిర్మాణ సమయంలో అయిన ఖర్చుకు వడ్డీ లెక్కించి, ప్రస్తుత మార్కెట్ ధరకు జతచేసి ధరలను ఖరారు చేయటంతో అవి సాధారణ ప్రజలు భరించలేని స్థాయిలో ఉన్నాయి. పెంట్‌హౌస్ ధరలైతే ఏకంగా రూ.68 లక్షలుగా పేర్కొనటం విశేషం. గతంలో వేలం నిర్వహించిన సమయంలో నిర్ధారిత తేదీని పేర్కొన్న అధికారులు, ఈసారి గడువు అంటూ లేకుండా ‘ఎవరు ముందు వస్తే వారికి’ పద్ధతిలో అమ్మాలని నిర్ణయించారు.