వాలెంటైన్స్‌డే నాడు విషాదం
భవనంపై నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి
ప్రేమికుడితో గొడవపడిన కొద్దిసేపటికే దారుణం
గచ్చిబౌలి: ప్రేమికుల రోజున సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పదస్థితిలో భవనం పైనుంచి పడి మృతి చెందింది. మాదాపూర్ సీఐ జగదీశ్వర్ తెలిపిన వివరాలు.. యాప్రాల్‌లోని సాయికృప కాలనీలో నివాసం ఉండే మాజీ సైనికుడు టి.సుదర్శన్ కూతురు సుప్రియ(23) మాదాపూర్, సైబర్ పెరల్‌లోని అసెంచర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఏడాదిన్నరగా విధులు నిర్వహిస్తుంది. సుప్రియ, అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే సాయి కిరణ్ ప్రేమించుకున్నారు. సాయికిరణ్ తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ప్రియురాలుతో సరిగా ఉండటం లేదు. కాగా శుక్రవారం సాయంత్ర ం విధులకు వెళ్లిన సుప్రియ రాత్రి 12 గంటలకు ఆఫీసు నుంచి బయటకు వెళ్లి సాయికిరణ్‌తో గొడవ పడినట్లు పోలీసులు తెలిపారు. తిరిగి ఇద్దరు కంపెనీలోకి వచ్చారు. అనంతరం బయటకు వెళ్ల్లిన ఆమె రాత్రి 1.30 గంటల సమయంలో భవనం కింద పండింది. సిబ్బంది గమనించి వెంటనే మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది.
సుప్రియ ఆత్మహత్య చేసుకుందా, ప్రమాద వశాత్తు పడిందా అనే విషయం పోస్టు మార్టం రిపోర్టుతో తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు. సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సాయి కిరణ్‌తో గతంలో గొడవలు జరిగాయని, తన కూతురు ఆత్మహత్యకు పాల్పడేంతా పిరికిది కాదని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో సుప్రియ తండ్రి సుదర్శన్ పేర్కొన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మిన్నంటిన రోదనలు
యాప్రాల్: సుప్రియ మరణ వార్త విన్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శనివారం సాయంత్రం యాప్రాల్ సాయికృప కాలనీలోని వారి ఇంటికి సుప్రియ మృతదేహం తీసుకురాగానే బంధువులు, కాలనీవాసులు చేరుకుని విలపించారు. అనంతరం యాప్రాల్‌లోని శ్మశాన వాటికలో సుప్రియ భౌతికకాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు.