గూడు.. గోడు...
ఒక్క రోజే 4 వేల దరఖాస్తులు
పెండింగ్‌లో 1.92 లక్షల ఇళ్ల అర్జీలు
సర్కారు మార్గదర్శకాలు లేక పరేషాన్
పాతికేళ్లలో నిర్మించినవి 40 వేల గృహాలే
వైఎస్ హయాంలోనే సగం ఇళ్ల నిర్మాణం
సిటీబ్యూరో:ఇళ్లు...స్థలాలు ఇస్తారనే ఆశతో వేలాది మంది కదిలారు. మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా హైదరాబాద్ కలెక్టరేట్‌కు క్యూ కట్టారు. దీంతో కలెక్టరేట్ సోమవారం పోటెత్తింది. స్థానికంగా ఉన్న మహిళా సంఘాల లీడర్లు, దళారులు, చోటా మోటా నాయకుల ప్రచారంతో వివిధ బస్తీల నుంచి మహిళలు, నిరుపేదలు ఆటోలు, ఇతర వాహనాలు అద్దెకు తీసుకొని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. దరఖాస్తులు ఇవ్వటానికి మహిళలు, పసిపిల్లలతో తల్లులు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కలెక్టరేట్‌లో సోమవారం ఒక్క రోజే ఇళ్ల కోసం 4 వేల మంది మహిళలు, నిరుపేద లు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ప్రజావాణిలో ఇళ్ల దరఖాస్తులు సమర్పించేందుకు రెండు, మూడు వారాలుగా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సోమవారం ఈ సంఖ్య ఒకేసారి నాలుగు వేలకు చేరుకుంది.
మార్గదర్శకాలు రాకుండానే...
పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని, స్లమ్ ఫ్రీ సిటీగా చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన పేదల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇళ్లు, స్థలాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మంజూరై... పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణంపై ఇప్పటి వరక ు సర్కారు నిర్ణయం ప్రకటించలేదు. కొత్త ఇళ్లపైనా మార్గదర్శకాలు లేవు. అదే సమయంలో నిత్యం వందలాది మంది దరఖాస్తులు సమర్పిస్తుండడంతో సంబంధిత అధికారులు ఇరకాటంలో పడుతున్నారు.
వైఎస్ హయాంలోనే సగం ఇళ్లు
హైదరాబాద్ నగరంలో గడచిన పాతికేళ్లలో వివిధ పథకాల కింద సుమారు 39,422 ఇళ్లు నిర్మించారు. ఇందులో సగానికి పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం లో నిర్మించనవేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రూ.వెయ్యి వంతున చెల్లించి...
రాజీవ్ గృహకల్ప పథకం కింద 2005-06లో హైదరాబాద్ జిల్లా గృహ నిర్మాణ సంస్థ 50 వేల నిరుపేద కుటుంబాల నుంచి దరఖాస్తులతో పాటు రూ.1000 వంతున వసూలు చేసింది. ఈ ఇళ్ల కోసం ఏడాదికి పైగా ఎదురు చూసినా ఫలితం లేకపోవటంతో 15 వేల కుటుంబాలు తాము చెల్లించిన మొత్తాన్ని వాపసు తీసుకున్నాయి. మిగిలిన 35 వేల మంది లబ్థిదారులు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ హయాంలో రాజీవ్ గృహ కల్ప కింద 5,206 ఇళ్లు నిర్మించారు. ఆ తర్వాత ఇళ్ల ఊసే లేదు.
జీ ప్లస్ 3కు నిరాదరణ
నగరంలోని కొన్ని మురికివాడల్లో జీ ప్లస్ త్రీ పద్ధతిలో గృహాలు నిర్మిస్తామని, ఆ స్థలాలు ఖాళీ చేయాలని పేదలను కోరినా స్థానికులు ఒప్పుకోకపోవటంతో ఆ యోచనకుస్వస్తి చెప్పినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములు అనేకం కోర్టు కేసుల్లో ఉండటంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నట్లు వివరిస్తున్నారు.
ఏళ్లుగా మారని తలరాతలు
హైదరాబాద్ జిల్లాలో 25 ఏళ్ల కాలంలో 39,422 ఇళ్లు నిర్మించారు. ఈ లెక్కలను పరిశీలిస్తే వైఎస్ హయాంలో రూరల్ జిల్లాలోని ఒక మండలంలో నిర్మించిన ఇళ్లు కూడా నగరంలో నిర్మించి ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 1989-90 నుంచి 2004-05 వరకు ఈడబ్ల్యూఎస్ ద్వారా 16,018 ఇళ్లు, 2001-02 నుంచి 2005-06 వరకు వాంబేలో 12,048 ఇళ్లు నిర్మించారు. 2005-06 నుంచి 2013-14 వరకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 11,444 ఇళ్లు మంజూరు కాగా, 6,150 మాత్రమే నిర్మించారు. 2005-06 నుంచి 2014 వరకు రాజీవ్ గృహకల్పలో 5,206 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు.
భారీగా పెండింగ్
గతంలో రాజీవ్ గృహ కల్పలో ఇళ్ల కోసం దరఖాస్తుతో పాటు రూ.1000 వంతున చెల్లించిన వారు 35 వేల మంది ఉన్నారు. రచ్చ బండలో 1.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్ ప్రజావాణిలో ఏడు నెలల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 34 వేల మంది. మొత్తంగా సుమారు 1.92 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
నా దరఖాస్తు తీసుకోలేదు
ఇళ్లు మంజూరు చేస్తున్నారని, కలెక్టరేట్ కువెళ్లి దరఖాస్తు పెట్టుకోవాలని మా బస్తీలో చెబితే వచ్చాను. ఇక్కడ టైమ్ అయిపోయిందని దరఖాస్తు తీసుకోలేదు. మండలాఫీసుకు వెళ్లి ఇవ్వాలని చెప్పారు. చంటి పిల్లతో అతి కష్టమ్మీద వచ్చినా లాభం లేకుండాపోయింది. నాకు ఇల్లు వస్తాదో, రాదోనని ఆందోళనగా ఉంది.
-లలిత, కిషన్‌బాగ్
ఉండడానికి సరిపోతే చాలు...
ఇళ్లు వస్తున్నాయని చెబితేమా వాడలోని మహిళలందరం కలసి ఆటోలో కలెక్టరేట్‌కు వచ్చాం. గంటకుపైగా లైన్‌లో నిలబడి దరఖాస్తులు ఇచ్చాం. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్‌లు కట్టిస్తానని చెప్పింది. మాకు ఉండటానికి సరిపోయే ఇళ్లు ఇస్తే చాలు.
-షమీమ్, ఫాతిమా బేగం, కిషన్‌బాగ్
తొందర పడొద్దు
ఇళ్ల కేటాయింపులకు ప్రభుత్వం నుంచి నియమ నిబంధనలు రావాల్సింది. దరఖాస్తుదారులు దళారులను నమ్మి మోసపోవద్దు. కొంత మంది దళారులకు డబ్బులు ఇస్త్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం ఇళ్ల కోసం మార్గదర్శకాలు ప్రకటించగానే ప్రాధాన్య క్రమంలో మంజూరు చేస్తాం.
- సంజీవయ్య, ఇన్‌చార్జి జేసీ