సచివాలయం పాత నమూనా
ప్రస్తుత మూడు బ్లాక్‌ల డిజైన్ మార్పునకు సీఎం ఆదేశం
పది అంతస్తులుగా నిర్మాణం
నిర్మాణ అంచనా రూ.180 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయ నిర్మాణానికి ఇటీవల సిద్ధం చేసిన డిజైన్లను మార్చాలని, నిర్మాణ విస్తీర్ణాన్ని సైతం తగ్గించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ముందుగా నిర్దేశించిన మూడు బ్లాక్‌లకు బదులు ఎత్తై ఒకే భవన సముదాయం నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కనీసం పది అంతస్తుల భవనం నిర్మించి చివరి (టాప్) ఫ్లోర్‌ను సీఎంవోకు కేటాయించాలని సూచించారు. ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం లేదని... కేవలం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవన నిర్మాణం చేపట్టాలని నిర్దేశించారు. అందుకు తగిన కొత్త డిజైన్లు తయారు చేయించాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త సచివాలయం అత్యద్భుతంగా ఉండాలని, చూడగానే అందరినీ ఆకట్టుకునే కళా నైపుణ్యం ఉట్టిపడాలని ఆర్ అండ్ బీ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
సచివాలయంలో పనిచేస్తున్న దాదాపు రెండు వేల మంది ఉద్యోగులకు వీలుగా వెయ్యి వాహనాలు నిలిపేలా పార్కింగ్ జోన్, రెస్టారెంట్, ఒక హెలిపాడ్, గుడి, మసీదు, చర్చి, పార్కుతోపాటు ఉద్యోగుల చిన్న పిల్లలను ఉంచేలా క్రెచెను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు కొత్త డిజైన్ రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించారు. గతంలో దేశంలో పేరొందిన భవన నిర్మాణ డిజైనర్ హఫీజ్ కాంట్రాక్టర్‌తో సచివాలయం డిజైన్లను తయారు చేయించారు. ఢిల్లీ తరహాలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, మధ్యలో సీఎంవో ఉండేలా ‘యూ’ ఆకారంలో ఉండే డిజైన్‌ను ముఖ్యమంత్రి ఆమోదించారు. వీటికి భారీ వ్యయం కావటం, నిర్మాణమూ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో కొత్త డిజైన్లకు సీఎం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎనిమిది లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపడితే రూ. 350 కోట్ల అంచనా వ్యయమవుతుందని, ముఖ్యమంత్రి కొత్త ఆదేశాలతో విస్తీర్ణం తగ్గిపోవటంతో ఈ వ్యయం రూ. 150 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు చేరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెలలోనే కొత్త సచివాలయానికి పునాది రాయి వేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.
బీఆర్‌కే భవన్‌లో తాత్కాలిక సర్దుబాటు
కొత్త డిజైన్లకు టెండర్లను పిలిచేందుకు ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ... ఆర్ అండ్ బీ ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డితో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉన్న చోటనే కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించడంతో నిర్మాణం పూర్తయ్యే వరకు అందులోని కార్యాలయాలను తాత్కాలికంగా ఎక్కడికి తరలించాలనే అంశంపై కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా బూర్గుల రామకృష్ణారావు భవన్, గృహకల్ప భవనాలను ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించారు. కొత్త నిర్మాణాల నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ కార్యాలయాలున్న భవనాలను సైతం తమకు అప్పగించాలని, అంత మేరకు ప్రత్యామ్నాయ భవనాలను సమకూరుస్తామని సీఎం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఏపీ సీఎస్‌కు లేఖ రాసినట్లు తెలిసింది.
నవంబర్ 24న సీఎం గృహ ప్రవేశం!
బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం వెనుక నిర్మిస్తున్న కొత్త అధికారిక నివాసానికి సంబంధించిన పనులను నవంబర్ 20లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో గృహ ప్రవేశం చేయనున్నారు. కార్తీక మాసం కావటంతో నవంబర్ 24న శుభ ముహూర్తం రోజున సీఎం కొత్త క్యాంప్ ఆఫీసులో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. కొత్త క్యాంప్ ఆఫీసుకు శ్వేతసౌధంలా తెల్ల రంగులే వేయాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్మాణంలో భాగంగా క్యాంపు ఆఫీసు ప్రాంగణంలో తొలగించిన అమ్మవారి ఆలయాన్ని పునర్ నిర్మించారు. ఈనెల 20న అమ్మవారిని పునఃప్రతిష్టిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.