ఘనంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు
అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం
త్వరలోనే పూర్తికాల వీసీ నియామకం
యూనివర్సిటీ పూర్వవైభవానికి చర్యలు చేపట్టాలి
ఉత్సవాల నిర్వహణకు సలహా మండలి ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిజాం హయాం నాటి ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా వచ్చే ఏడాది శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీకి పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల నిర్వహణపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య తదితరులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 1917లో ప్రారంభమైన ఓయూ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించిందని...వర్సిటీలో చదివిన ఎందరో విద్యార్థులు దేశవిదేశాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారన్నారు. వర్సిటీ నుంచి పట్టా పొందడాన్ని విద్యార్థులు ఎంతో గొప్పగా, ప్రత్యేకమైనదిగా భావించే వారని, తమ నామఫలకం (నేమ్‌ప్లేట్)పై విద్యార్హతలతోపాటు ఓఎస్‌ఎం అని రాసుకునే వారని సీఎం గుర్తుచేశారు. ఇప్పటికీ వివిధ రంగాల్లోని ప్రముఖుల్లో ఉస్మానియా నుంచి చదివిన వారే ఎక్కువ మంది ఉండటం విశేషమన్నారు. అలాంటి యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఉత్సవాలపై నివేదిక ఇవ్వండి
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీకి ఏం కావాలి, ఇందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని విద్యాశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే వర్సిటీకి పూర్తి కాల వీసీని నియమిస్తామన్నారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, ఎంపీ కె.కేశవరావు వంటి అనుభవజ్ఞులు, యూనివర్సిటీతో అనుబంధమున్న వారితో సలహా మండలిని ఏర్పాటు చేసి శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఉస్మానియాలో చదివి విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఉత్సవాల్లో భాగంగా ఎన్‌ఆర్‌ఐ సదస్సును నిర్వహించాలని సీఎం సూచించారు. 1975 వరకు తెలంగాణలోని విద్యా సంస్థలన్నీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నాయని...అందుకే ఇక్కడ చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరినీ భాగస్వాములను చేయాలన్నారు. వర్సిటీలో చదివిన విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, సాహితీవేత్తలు, సివిల్ సర్వెంట్లు, కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు, జర్నలిస్టులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖుల జాబితా రూపొందించి వారందరినీ ఉత్సవాలకు ఆహ్వానించాలని సూచించారు.
నకిలీ సర్టిఫికెట్లకు స్థానం లేదు
విద్యా వ్యవస్థను బలహీనపరుస్తూ పరీక్షలను అపహాస్యం చేసేలా ప్రవర్తించే వ్యక్తులు, శక్తులపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పోలీస్ శా ఖను ఆదేశించారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, నకిలీ సర్టిఫికెట్లకు స్థానం లేదని... తప్పుడు పద్ధతులు అవలంబించే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలన్నారు. ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ పొరపాటు జరగడానికి అవకాశం ఉందో గమనించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.