పాలమూరు, కాళేశ్వరంలకే రూ.16 వేల కోట్లు
♦ త్వరలోనే వీటికి టెండర్లు
♦ జనవరి చివరి వారం నుంచి నిర్మాణ పనులు
♦ పాలమూరులో నిర్మాణంలోని ప్రాజెక్టులకు మరో 900 కోట్లు
♦ రూ.25 వేల కోట్ల బడ్జెట్‌లో వీటికే ప్రాధాన్యతనిస్తూ ఆమోదం తెలిపిన కేబినెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు చెరో రూ.8 వేల కోట్ల కేటాయింపులతో మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర కేటాయించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. వీటికి ఈ నెలలోనే టెండర్లు ఖరారు చేసి చివరి వారం నాటికి పనులు మొదలుపెట్టాలని నిశ్చయానికి వచ్చింది. రీ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న డిండి, దుమ్ముగూడెం, కంతనపల్లి, ఇందిరమ్మ వరద కాల్వలతో పాటు తక్షణ ఆయకట్టునిచ్చే దశలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకు సుమారు రూ.900 కోట్ల మేర కేటాయింపులు జరిపేందుకు కేబినెట్ సంసిద్ధత తెలిపింది.
మొత్తంగా ఈ ఏడాది నుంచి వరుసగా వచ్చే బడ్జెట్‌లలో నీటి పారుదల శాఖకు రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదన తేగా దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం పాలమూరు, కాళేశ్వరం, డిండి ఎత్తిపోతలతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ పరిధిలో రీ డిజైనింగ్ తదితరాలపై ముఖ్యమంత్రి కేబినెట్‌కు వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించేలా వేస్తున్న ప్రణాళికలు, గోదావరి నీటిని సాధ్యమైనంతగా సమర్ధంగా వినియోగించుకునేందుకు బ్యారేజీలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి చేపడుతున్న చర్యలను దృష్టికి తెచ్చారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని, అందులో ఒక్క మహబూబ్‌నగర్‌లోనే 8 లక్షలకు పైగా ఎకరాలకు నీటిని అందించొచ్చని తెలిపినట్లుగా చెబుతున్నారు. ఈ దృష్ట్యానే పాలమూరులో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు రూ.900 కోట్ల మేర కేటాయించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, నిజాంసాగర్ ఆధునీకరణ, ఎల్లంపల్లిలో మరింత నీటి వినియోగంపై దృష్టి పెట్టినట్లు తెలిపినట్లుగా తెలిసింది.