'ఇద్దరు సీఎంలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి పాలనతో తెలుగు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో పాల్వాయి మాట్లాడుతూ... ఈ రెండు రాష్ట్రాలలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా... ఇద్దరు సీఎంలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
పుష్కరాలను ప్రచార ఆర్భాటం కోసమే ఇద్దరు సీఎంలు పని చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగంగాకాదని ఇరిగేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని పాల్వాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆయన నిలదీశారు.
అలాగే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ ఆమోదనీయంకాదని కూడా కమిటీ చెప్పిందన్నారు. అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరడం ప్రజలను మభ్యపెట్టడమే అని కేసీఆర్పై పాల్వాయి మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న మేరకే ప్రాణహిత - చేవెళ్ల కట్టాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. సీడబ్ల్యూసీ ఒప్పుకున్నా ఇచ్చంపల్లి పాజెక్టును ఎందుకు చేపట్టడంలేదన్న కేంద్రం ప్రశ్నకు కేసీఆర్ సర్కార్ స్పందించడం లేదన్నారు.