పనామాలో తెలుగువాళ్లు...
హైదరాబాద్ : పనామా సెగ తెలుగు గడ్డనూ తాకింది. సెంట్రల్ అమెరికాలో ఉవ్వెత్తున ఎగిసిన పనామా పేపర్స్ సునామీలో పలువురు తెలుగువాళ్ల పేర్లు తెరమీదకు వచ్చాయి. నల్ల ధన కుబేరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మోటూరి శ్రీనివాస ప్రసాద్, వోలం భాస్కరరావు, భావనాశి జయకుమార్ పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
మోన్సాక్ ఫోన్సెకా బయటపెట్టిన ఈ జాబితాలో మోటూరి శ్రీనివాస ప్రసాద్ 2011లో నమోదైన నాలుగు సంస్థల్లో విదేశీ డైరెక్టర్లుగా కొనసాగుతోంటే, మరో ఇద్దరు వోలం భాస్కరరావు, భావనాశి జయ కుమార్‌లు ఎస్‌డి వెంచర్స్, సికా సెక్యురిటీస్, భాసు కేపిటల్స్, బీపీ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లో వాటాదారులుగా పేర్కొంది. అయితే వీరు చట్టబద్ధంగా తమ ధనాన్ని దాచుకున్నారా? లేక అది నల్లధనమా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పనామాలో తెలుగోళ్ల పేర్లు బయటకురావటం హైదరాబాద్ వ్యాపారవర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.
కాగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ దేశాలను వదిలి పన్ను స్వర్గాల్లాంటి విదేశాల్లో డమ్మీ కంపెనీలు పెట్టి, వాటిలోకి ఇన్వెస్ట్‌మెంట్లు తరలించిన వ్యవహారంలో భారతీయులకు సంబంధించి నిన్న రెండో జాబితా బయట పడిన విషయం తెలిసిందే.