
రాహుల్ గాంధీని పిలుద్దామా?
భూ నిర్వాసితులపై పీసీసీ భేటీలో చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూసేకరణ చట్టాన్ని అమలుచేయకుండా, రైతులపై దాడులకు దిగుతున్న ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలనే ప్ర తిపాదనపై పీసీసీ చర్చించింది. భూసేకరణ అంశం, అటవీ భూముల చట్టంపై పీసీసీ ఏర్పాటు చేసిన కమిటీలు గురువారం గాంధీభవన్‌లో సమావేశమయ్యాయి. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు డి.కె.అరుణ,సునీతాలక్ష్మారెడ్డి, ముఖ్యనేతలు శ్రవణ్, పొన్నం ప్రభాకర్, ఎం.కోదండరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తది తరులు పాల్గొన్నారు.
మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉన్న జీఓ 123 వంటివాటిపై దేశ వ్యాప్తంగా చర్చ లేవనెత్తడానికి రాహుల్‌గాంధీ పర్యటన ఉపయోగపడుతుందని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.ఈ ప్రతిపాదన రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకుపోయి, తరువాత నిర్ణయం తీసుకుందామని నిర్ణయించారు. అప్పటిదాకా కేవలం మల్లన్నసాగర్‌కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల కింద మునిగిపోతున్న భూములు, అక్కడి నిర్వాసితుల తరుపున పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు.