కారుణ్య నియామకాలు కలేనా!
ఆర్టీసీలో 1,868 కుటుంబాల నరకయాతన
ప్రభుత్వం అనుమతించినా పట్టని యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన రాములు ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్.. 2011 మార్చిలో అనారోగ్యంతో మృతి చెందాడు. కారుణ్య నియామకాల కోటాలో తనకు అవకాశం కల్పించాలంటూ ఆయన భార్య ఆర్టీసీకి దరఖాస్తు చేసింది. ఆమె దరఖాస్తు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఆ పేద కుటుంబానికి ఇప్పుడు ఆసరా లేకుండాపోయింది. ఆ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి.. కొడుకు ఉన్నత చదువు.. ఈ రెండూ పెద్ద సమస్యగా మారాయి. పూట గడవటమే కష్టంగా మారిన తరుణంలో ఆమె కుట్టుమిషన్‌తో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇది ఒక్క రాములు ఇంటి దుస్థితి కాదు.. 1,868 కుటుంబాలను నరకయాతనకు గురిచేస్తున్న ఆర్టీసీ యంత్రాంగం నిర్లక్ష్యం.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు అధికారుల ఇష్టారాజ్యంతో అభాసుపాలవుతున్నాయి. కుటుంబ పెద్ద అకస్మాత్తుగా మృత్యువాత పడితే.. ఆ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో అర్హత ఆధారంగా ఆర్టీసీలో ఉపాధి కల్పించే వెసులుబాటు ఉంది. కండక్టర్, డ్రైవర్, మెకానిక్.. ఈ మూడు పోస్టుల్లో ఏదో ఓ దానిలో నియమించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిం చింది. కానీ ఆ నియామకాల విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రస్తుతం 1,868 దరఖాస్తులు కార్యాలయాల్లోనే దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఆ కుటుంబసభ్యులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. నియామకాలు మాత్రం జరగటం లేదు.
2011 జనవరి 1వ తేదీ తర్వాత చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా కారుణ్య నియామకాలకు అనుమతి ఇస్తూ గత ఫిబ్రవరి ఏడో తేదీన ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.15ను జారీ చేసింది. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కసరత్తే మొదలు కాలేదు. అంతకుముందు చనిపోయిన కుటుం బాలకు సంబంధించి 1,120 దరఖాస్తులు అంద గా వాటిని పరిశీలించి 800 మందిని ఎంపిక చేశారు. కండక్టర్ పోస్టుకు అవసరమైన ఎత్తు లేకపోవటం, వయసు మరీ ఎక్కువగా ఉండటం, కనీస విద్యార్హత లేకపోవటం లాంటి కారణాలతో 300 దరఖాస్తులను తిరస్కరించారు. కొత్త జీవో ప్రకారం నెలలు గడుస్తున్నా కసరత్తు మొదలు కాకపోవటంతో ఆ కార్మికుల కుటుం బాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.
వేలాదిగా డ్రైవర్ పోస్టుల ఖాళీ
డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ (మెకానిక్) పోస్టులనే కారుణ్య నియామకాలకు కేటాయించారు. వీటికి దాదాపు మహిళలే దరఖాస్తు చేస్తున్నందున వారు డ్రైవర్, మెకానిక్ పనిని ఇష్టపడక పోతుండటంతో ఒక్క కండక్టర్ పోస్టుకే పోటీ నెలకొంది. మహిళల కోటాలో ప్రస్తుతం ఆర్టీసీలో 13 వేల మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. వారికి అంతే సంఖ్యలో డ్రైవర్ పోస్టులు ఉన్నా.. ఎవరూ రాకపోవటంతో అవన్నీ ఖాళీగా ఉన్నాయి. మహిళలను డ్రైవర్లుగా నియమించే విషయంలో అధికారులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించకపోవటంతో ఈ పరిస్థితి నెల కొంది.