చుక్క చుక్కకూ మోసం
పెట్రోల్ బంకుల్లో దగా
తూనికలు, కొలతల శాఖ స్పెషల్ డ్రైవ్
వరుసగా ఐదు రోజులు దాడులు అక్రమాల గుర్తింపు
సిటీబ్యూరో: కొలతల్లో చేతివాటం... డిస్‌ప్లేలో దగా... స్టాంపింగ్ లేకుండా నిర్వహణ... ఇదీ గ్రేటర్ హైదరాబాద్‌లోని పెట్రోల్ బంక్‌ల తీరు. తూనికలు, కొలతల శాఖ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తాజాగా ఐదు రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో బంకుల అక్రమాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 11 వరకు దాడులు చేసి... తక్కువ పెట్రోల్ పోయడం... స్టాంపింగ్ లేని 37 బంకులపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. మొత్తం కేసుల్లో 19 గ్రేటర్‌లో నమోదయ్యాయి. వీటిలో నగరంలో 8... శివార్లలో 11 బంకులు ఉండటం గమనార్హం. ఏడాది క్రితం స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌వోటీ) పోలీసులు, తూనికలు, కొలతల శాఖ దాడుల్లో ఫిల్లింగ్ మిషన్ల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లు ఏర్పాటు చేయడం... రిమోట్ కంట్రోలింగ్ మోసాల వంటివి బయటపడ్డాయి. అప్పట్లో అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి... జరిమానాలతో సరిపెట్టారు. దీంతో మోసాలకు అడ్డుకట్ట పడలేదు.
ప్రతి లీటర్‌కు 20 ఎంఎల్ కోత
గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో డీలర్లు భారీగా చేతివాటం చూపుతున్నారు. ప్రతి లీటర్‌కు సగటున 8 నుంచి 20 ఎంఎల్ వరకు తక్కువగా ఉంటోంది. తాజాగా కుత్బుల్లాపూర్‌లో ఐఓసీకి చెందిన విజయా ఫిల్లింగ్ స్టేషన్‌పై అధికారులు దాడులు చేశారు. అక్కడ కొలతల తీరు పరిశీలించి... భారీగా తేడా ఉన్నట్టు గుర్తించారు.
ధరలోనూ మాయ
పెట్రోల్, డీజిల్ ధరల హెచ్చు, తగ్గుల సమయాల్లోనూ డీలర్లు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. నేరుగా రిమోట్, కీ ప్యాడ్, హ్యాండిల్ టెర్మినేషన్, మాన్యువల్‌విధానాల్లో మార్పు చేస్తున్నారు. తూనికల, కొలతల శాఖ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో మెమోరైజ్‌డ్ ప్రింటెడ్ మార్పిడి చేయాలి. కానీ ఆయిల్ కంపెనీల నుంచి ధరలకు సంబంధించిన సమాచారం అందగానే డీలర్లు, ఉద్యోగులు అంచనా మేరకు మార్పులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
లాక్ ఏదీ?
తూనికల, కొలతల శాఖ అధికారులు ఏడాదికోసారి కొలతలను పరిశీలించి... ఫిల్లింగ్ మిషన్‌కు సీల్‌వేసి స్టాంపింగ్ చేస్తారు. దీని కోసం డీలర్లు ఏటా గడువు కంటే పక్షం రోజుల ముందు సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తూనికలు, కొలతల శాఖతో పాటు ఆయిల్ కంపెనీల అధికారులు, ఇద్దరు టెక్నీషియన్ల సమక్షంలో కొలతలు పరిశీలించి... స్టాంపింగ్ చేస్తారు. కానీ ఎక్కడా కీ ప్యాడ్‌లకు లాక్ కనిపించడం లేదు. కేంద్ర తూనికలు, కొలతల చట్టం-2009 సెక్షన్ 22 ప్రకారం బంకులలో రిమోట్ వినియోగించడం నిబంధలకు వ్యతిరేకం. ఇది బాహాటంగా సాగడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది.