పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్: పెట్రోలియం, ఎల్పీజీ ట్యాంకర్లపై విధించిన విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం రద్దు చేయాలని, లేకుంటే ఈ నెల 29 అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగుతామని తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కె. రాజశేఖర్, డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్, ఎల్‌పీజీ ట్రక్స్ ఓనర్స్ అధ్యక్షుడు సురేశ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరీఫ్ ఉల్ ఉస్సెన్, కోశాధికారి బీఎన్ ప్రసాద్ మాట్లాడారు.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో రవాణా కిరాయిలపై 5 శాతం వ్యాట్‌ను విధించగా... ఈ నెల 5న తెలంగాణ ప్రభుత్వం దానిని 14.5 శాతానికి పెంచిందన్నారు. ప్రభుత్వం దీన్ని తక్షణమే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన, ఇకపై విధించే పన్నులను ఆయిల్ కంపెనీలే భరించాలన్నారు. ఇకపై డీజిల్ ధరలు పెరిగినా, తగ్గినా అదే రోజు నుంచి కిరాయి సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జాయింట్ సెక్రటరీ కె. సుధాకర్‌రెడ్డి, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.