మొక్కలుంటే ఇవ్వరా...ప్లీజ్
- అందుబాటులో లేక కార్యక్రమం వాయిదా
- 22న నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్ : హరితహారానికి మొక్కల కొరత ఏర్పడింది. మంగళవారం ‘ప్రత్యేకం’గా హరితహారం నిర్వహించాలనుకున్న వ్యవసాయ శాఖకు మొక్కలే దొరక్క కార్యక్రమం వాయిదా వేసుకుంది. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో శాఖ అధికారులు హైరానా పడుతున్నారు. ఎన్ని దొరికితే అన్నింటితో ఎలాగైనా ఈ నెల 22న ప్రత్యేక హరితహారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద్యాన శాఖ వద్ద ఉన్నవన్నీ పండ్లు, పూల మొక్కలు కావడంతో ఒక్కోదానికి రూ.30 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇంత భారం భరించడం కష్టమని... ఒకట్రెండు రూపాయలు ఖర్చయ్యే టేకు తదితర మొక్కలతోనే కార్యక్రమాన్ని కానిచ్చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
లక్ష్యం... 2.5 కోట్ల మొక్కలు...
రైతులకు ఉపయోగపడేలా ప్రత్యేక హరితహారానికి వ్యవసాయ శాఖ అధికారులు రూపకల్పన చేశారు. మూడు రకాలుగా దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఒకటి పొలం గట్లపైన తక్కువ నీడనిచ్చే మొక్కలు నాటడం. వాటిల్లో టేకు, వెదురు మొక్కలు వంటి మొక్కలు నాటాలని నిర్ణయించారు. రెండోది బీడు భూముల్లో యూకలిప్టస్ వంటివాటిని పెంచడం. పది పదిహేను ఏళ్ల తర్వాత ఆ చెట్లను విక్రయించుకోవడం ద్వారా రైతులు లాభం పొందేలా చూడడం ఈ రెండింటి ఉద్దేశం. మూడోది ఇతర పబ్లిక్ స్థలాల్లో నాటడం. ఈ క్రమంలో ఒక్కో పంచాయతీలో 3వేల చొప్పున మొత్తంగా 2.5 కోట్ల మొక్కలతో ప్రత్యేక హరితహారాన్ని నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అందుకోసం వారం రోజులు గా ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా మొక్కల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆయన జోక్యం చేసుకున్నా మొక్కలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంలేదు. గ్రామీణాభి వృద్ధి, అటవీశాఖ అధికారులతో ఆయన మాట్లాడినట్లు సమాచారం. అంత స్థాయిలో మొక్కలు ఇవ్వడం సాధ్యం కాదని ఆ శాఖల అధికారులు చెప్పినట్లు తెలిసింది.
ఇతర రాష్ట్రాల నుంచి...
ప్రత్యేక హరితహారాన్ని జయప్రదం చేసేందుకు కలెక్టర్లు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమిళనాడు, మహారాష్ట్ర, ఛ త్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి మొక్కలను రప్పిస్తున్నారు. మొక్కల సేకరణ కోసం కలెక్టర్లు సమయం అడిగినందునే ప్రత్యేక హరితహారాన్ని వాయిదా వేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. 22న పూర్తిస్థాయిలో మొక్కలు సేకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు.