అండగా ఉంటాం
* అభివృద్ధి మంత్రమే అన్నింటికీ పరిష్కారం: ప్రధాని మోదీ
* రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో వెన్నంటే ఉంటాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భుజం భుజం కలిపి కలిసికట్టుగా పని చేస్తుందని అన్నారు. ‘ఢిల్లీ మీకెంతో దూరంలో లేదు. హైదరాబాద్ మీకు ఎలాంటిదో.. ఢిల్లీ కూడా అలాంటిదే..’ అని అంటూ ప్రజలకు భరోసానిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో దేశం అత్యున్నత శిఖరాలను చేరుతుందన్నారు. అభివృద్ధి మంత్రమే అన్నింటికీ సమాధానం చెబుతుందని పేర్కొన్నారు.
అభివృద్ధిలో ఒక రాష్ట్రంతో మరో రాష్ట్రం పోటీ పడటం చూస్తే తనకు ఆనందంగా ఉందని, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన ఈ పోటీ దేశ అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే తరహాలో అభివృద్ధికి పోటీ పడాలని ఆకాంక్షించారు. రాష్ట్రాలు రాష్ట్రాలతోనే కాదు.. కేంద్రంతోనూ పోటీ పడాలన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ఆదివారం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇదే సందర్భంగా రామగుండంలోని 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపన ఫలకాలను ఆవిష్కరించారు.
వీటితోపాటు వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసే శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగలో సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘సోదర సోదరీమణులారా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని అన్నారు. తర్వాత హిందీలో 36 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే..
రెండేళ్లలోనే ఎన్నో పనులు
తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ. దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రం. ఇంత తక్కువ సమయంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది. ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తోందనే విశ్వాసం నాకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయిచేయి కలిపి ముందడుగు వేస్తే వచ్చే ఫలితానికి నేడు ఇక్కడ ఆవిష్కరించిన అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. నీరు, విద్యుత్, ఎరువులు.. ఈ కార్యక్రమం పంచశక్తుల ఆవిష్కారాన్ని తలపించింది. కేంద్ర రాష్ట్రాల సంబంధాలకు ఇది అసలైన ప్రతీక. సహకార సమాఖ్యకు నిదర్శనం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పనులు చేపట్టింది. అవన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నాను.
అమ్మ కన్నా ఆవు మిన్న
ఆవులు ఉంటే మన దేశ సంపద పెరిగినట్లే. ఆవును వ్యవసాయంతో అనుసంధానం చేయాలి. అమ్మ చిన్నప్పుడు కొన్నేళ్లు తన పిల్లలకు పాలు అందిస్తుందని, కానీ ఆవు మాత్రం జీవితాంతం పాలిస్తుందని గాంధీ చెప్పారు. రైతులకు భూమిని మించిన తల్లి లేదు. అందుకే భూసార పరీక్షలు ప్రవేశపెట్టాం. ఆవు పేడ, మూత్రం భూసారాన్ని పెంచుతాయి. ఆవును వ్యవసాయంతో అనుసంధానం చే స్తే భూమి ఆరోగ్యం బాగుపడుతుంది. పంటలు సమృద్ధిగా పండితే అది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆలమంద ఉంటే మన సంపద రెట్టింపయినట్లే.
ఇప్పుడు మిగులు విద్యుత్
నిన్నటి వరకు విద్యుత్ కొరతతో ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రాలు అయ్యాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలో విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలతోనే ఇది సాధ్యమైంది. తెలంగాణ ఏర్పడిన సమయంలో ఒక్కో యూనిట్ విద్యుత్ రూ.11.50కు అందుబాటులో ఉంటే.. ఇప్పుడు కేవలం ఒక రూపాయి పది పైసలకే లభ్యమవుతోంది. ప్రపంచంలో ఇప్పుడు తాగునీటి సమస్య నెలకొంది.
నీరు, సౌర శక్తి ప్రకృతి ప్రసాదించిన వరాలు. సౌరశక్తిని ఒడిసిపడితేనే భవిష్యత్తు అవసరాలకు భరోసా ఉంటుంది. రెండేళ్ల కిందటి వరకు దేశంలో కేవలం 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కాగా.. ఇప్పుడు 3 వేల మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. సౌర విద్యుత్ సాయంతో మిషన్ భగీరథను ముందుకు తీసుకెళ్లాలి. దీంతో కరెంటు చార్జీలు తగ్గుతాయి.
కొరత లేకుండా చేశాం
గతంలో ప్రభుత్వాలు ఎరువులపై సబ్సిడీలు ఇచ్చేవి. కానీ ఆ సబ్సిడీ రైతులకు చేరేది కాదు. ఎందుకంటే ఎరువులే అందుబాటులో ఉండేవి కాదు. ఎరువుల్లేనప్పుడు సబ్సిడీలు ఇచ్చి ఏం లాభం? దేశంలో ఇప్పుడు ఎక్కడా ఎరువుల కొరత లేదు. రైతులకు సరసమైన ధరల్లో ఎరువులు అందించేందుకు కృషి చేస్తున్నాం. వేపపూత ఉన్న ఎరువులతో భూసారం పెరిగింది. నాలుగేళ్ల కిందట నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియా కొరత ఉండేది. తమ రాష్ట్రాలకు యూరియా కేటాయించాలని సీఎంలు ప్రధానికి లేఖలు రాసేవారు. గడిచిన రెండేళ్లలో యూరియా కోసం ముఖ్యమంత్రి లేఖలు రాసే అగత్యం రాలేదు.
గతంలో ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చేది. రైతులు రాత్రింబవళ్లూ క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఎరువుల కర్మాగారాల్లో అవినీతి, గోదాముల్లో చోరీలు, అగ్నిప్రమాదాలు జరిగేవి. తెలంగాణలో ఇప్పటివరకు ఎరువుల కర్మాగారం లేదు. ఎరువులు అందుబాటులోకి తెచ్చేందుకు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నాం.
రైల్వే లైన్లు పూర్తి చేసి చూపిస్తాం
ఎంతోకాలంగా తెలంగాణ అడుగుతున్న రైల్వే లైన్లను పూర్తి చేసి చూపిస్తాం. గతంలో ఎందరో ప్రధానులు వచ్చిపోయినా ఈ రైల్వేలైన్‌కు మోక్షం రాలేదు. దేశంలో ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైల్వే లైన్లను అనుసంధానం చేస్తున్నాం. నిర్దేశిత సమయంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్నవి పూర్తి చేస్తాం.
గోరక్షణ పేరుతో దాడులు సరికాదు
గోసంరక్షణ పేరుతో భారతీయ సమాజాన్ని చీల్చేందుకు కొందరు నకిలీ గోరక్షకులు కుట్ర పన్నుతున్నారు. గోరక్షణ పేరుతో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారి పట్ల అసలైన గోరక్షకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటివారివల్ల అందరికీ చెడ్డపేరు వస్తుంది. వారిని సమాజం నుంచి వెలివేయాలి. గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులు సరైనవి కావు. మీ ఆటలు కట్టిపెట్టండి. ఘర్షణ వాతావరణం సృష్టించే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నా.
హామీల్లేని ప్రధాని ప్రసంగం
కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రధాని, ముఖ్యమంత్రి పరస్పరం సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ప్రధాని తెలంగాణకు ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం ప్రజలను నిరాశకు గురి చేసింది. ప్రభుత్వం నడపడంలో ఇబ్బందులు తనకు తెలుసని.. అది కావాలి, ఇది కావాలని తాను అడగటం లేదని కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రూ.50 వేల కోట్లు, లక్ష కోట్లు కావాలని కోరడం లేదంటూనే.. ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తారు.
సాగునీటి కొరత తీర్చేందుకు రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరారు. ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ హామీని అమలు చేయాలన్నారు. అయితే వీటిలో ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రధాని ఎక్కువగా జాతీయ స్థాయి అంశాలనే ప్రస్తావించారు. తెలంగాణలో ఉన్న పెండింగ్ రైల్వే లైన్లను పూర్తి చేస్తామన్న ఒక్క హామీ మాత్రమే ఇచ్చారు.
సాగు, తాగునీరే కేసీఆర్ మిషన్
ఈ రెండేళ్లలో కేసీఆర్ ఎన్నోసార్లు నన్ను కలిశారు. ప్రతిసారీ తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడారు. ప్రధానంగా నీటి అంశాన్ని ప్రస్తావించేవారు. నీటి విషయం ఎత్తినప్పుడల్లా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యేవారు. ప్రతిసారి అభివృద్ధి, సాగు, తాగునీటి గురించే మాట్లాడారు. తెలంగాణకు సాగు, తాగు నీరందించడమే ఆయన మిషన్ అని నాకు అర్థమైంది. మిషన్ భగీరథ గురించి చాలాసార్లు చెప్పారు. గుజరాత్‌లో మంచినీటి సరఫరాను పరిశీలించేందుకు ఓ టీమ్‌ను పంపించినట్లు చెప్పారు. అదే తీరుగా రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చనేందుకు ఇది నిదర్శనం.
నీరుంటే మట్టిలోంచి బంగారం..
రైతులకు నీరివ్వడం ఓ బృహత్తర కార్యక్రమం. దేశానికి రైతులే పట్టుగొమ్మలు. అందరికీ నీటిని అందించటం మన బాధ్యత. అందుకే ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన. నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నీరుంటే మట్టి నుంచి బంగారం తీయొచ్చు. పొలానికి నీరు అందితే రైతులు బంగారం పండిస్తారు. జలమే జీవం. నీళ్లున్నంత వరకు నీటి విలువ తెలియదు. లేనపుడు దాని విలువ తెలుస్తుంది.
గాంధీ పుట్టిన పోర్‌బందర్‌కు వెళ్లి చూస్తే ఒక్కో నీటి బొట్టును ఎలా సంరక్షిస్తున్నారో అర్థమవుతుంది. రెండు వందల ఏళ్ల కిందటే వాన నీటి సంరక్షణకు వివిధ మార్గాలు అనుసరించటం గొప్ప విషయం. అప్పుడు నీటి కొరత లేకున్నా.. అనుసరించిన మార్గాలు యావత్ దేశానికి ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతి నీటి బొట్టును వ్యవసాయానికి మళ్లిస్తే గ్రామాల్లో జీవన ప్రమాణాలు మారిపోతాయి.
ట్వీట్లతో ధన్యవాదాలు
రాష్ట్రంలో పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లుగా దేశంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అవినీతి రహిత పాలన సాగుతోందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎంవో ట్వీటర్‌లో పోస్ట్ చేసింది. దానిపై స్పందించిన ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు.