రాజీవ్‌గృహకల్పలో అలజడి
* పోలీసుల కార్డన్ సర్చ్
* 32 ద్విచక్రవాహనాల స్వాధీనం
* పోలీసుల అదుపులో 12 మంది అనుమానితులు
కుత్బుల్లాపూర్/ జగద్గిరిగుట్ట: అర్ధరాత్రి పోలీసుల బూట్ల చప్పుళ్లు.. ఒక్కసారిగా అలజడి.. తేరుకునే సరికి కార్డన్ సర్చ్ పేరిట పోలీసుల హడావుడి.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుని పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ అనుమానాలు నివృత్తి చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న కార్డన్ సర్చ్‌లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహకల్పలో బాలానగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో విసృ్తత సోదాలు నిర్వహించారు. పోలీసులు వచ్చి ఇలా ఆకస్మాత్తుగా సోదాలు చేయడం శుభ పరిణామమేనని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు ఇటువంటి సోదాలు జరిపితే సంఘ విద్రోహశక్తుల్లో భయం పుడుతుందని వారన్నారు.
మూడు గంటలు.. అష్ట దిగ్బంధం..
జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహకల్ప సముదాయంలో సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు బాలానగర్ డీసీపీ ఆర్.శ్రీనివాస్ నేతృత్వంలో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోలీసులు బృందాలుగా విడిపోయి ఇంటింటినీ సోదా చేశారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఐదుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 420 మంది పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. గృహకల్ప చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని బయటకు, లోనికి వెళ్లకుండా అష్టదిగ్బంధం చేసి మొత్తం 32 ద్విచక్ర వాహనాలు, పది ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకొని 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
వందల కొద్దీ సిమ్‌కార్డులు...
కార్డన్ సర్చ్ సందర్భంగా రాజీవ్ గృహకల్పలో ఉంటున్న ఓ వ్యక్తి వద్ద ఎయిర్‌సెల్‌కు సంబంధించిన వందల సిమ్‌కార్డులు దొరికాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరింత సోదా చేయగా అతని వద్ద పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు వేరే వ్యక్తుల డాక్యుమెంట్లు లభించాయి. వీటి వివరాలు పరిశీలించిన తర్వాత సిమ్ కార్డుల బాగోతంపై దృష్టి పెడతామని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.