పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం
► 92 శాతం పైగా హాజరైన అభ్యర్థులు
►‘ఎస్సై’తో పోల్చితే కాస్త ఫర్వాలేదనిపించిన పరీక్ష
► తెలంగాణ ఉద్యమ చరిత్రకు దక్కని చోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 92.07 శాతం పైగా అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ విభాగాల్లోని 9,281 పోస్టులకు 5.35 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... పరీక్షకు 4.92 లక్షల మంది హాజరైనట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో 90 శాతానికి పైగా అభ్యర్థులు హాజరు కాగా... హైదరాబాద్ జిల్లాలో 87.16 శాతం, రంగారెడ్డి జిల్లాలో 88 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు.
ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అభ్యర్థులందరి వేలిముద్రలు తీసుకున్నారు. ఎస్సై రాత పరీక్ష సందర్భంగా బయోమెట్రిక్ మిషన్లు కాస్త మొరాయించడంతో ఈసారి వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మిషన్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా నిపుణులను అందుబాటులో పీఆర్‌బీ ఉంచింది. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు నగర, పట్టణ శివార్ల నుంచి వచ్చే వారికి సులువుగా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించారు.
ఉద్యమ చరిత్రకు దక్కని చోటు...
ఎస్సై రాత పరీక్షలో తెలంగాణ ఉద్యమానికి కాస్త ప్రాధాన్యం దక్కినా... కానిస్టేబుల్ రాత పరీక్షలో స్థానం దక్కలేదు. తెలంగాణ చరిత్రకు సంబంధించి కేవలం ఒకే ప్రశ్న అడగ్గా, ఎక్కువగా శాతవాహనులు, కాకతీయుల చరిత్రకు సంబంధించిన ప్రశ్నలే అధికంగా వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. మొత్తం మీద కానిస్టేబుల్ పరీక్షా విధానం ఎస్సై రాత పరీక్షతో పోల్చితే కాస్త సులభంగా ఉన్నట్లు తెలిసింది. అర్థమెటిక్, రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు సులభంగా ఉండటంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.