నిందితుడితో పోలీస్ దోస్తీ..!
కస్టడీ నిబంధనలకు నీళ్లు
రెస్టారెంట్‌కు తీసుకెళ్లి బిర్యానీ ఆరగింపు
చంచల్‌గూడ: విచారణ నిమిత్తం ఓ నిందితుడిని నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి ఆదేశించింది. జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు అతగాడికి రాచమర్యాదలు చేసిన విచిత్ర వైనం ఇది. కస్టడీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన పోలీసులు నిందితుడితో చెట్టాపట్టాలేసుకొని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ ఆరగించారు. ఈ దృశ్యాన్ని సాక్షి చిత్రీకరించింది.పూర్తి వివరాలు... బేగంపేటలోని అమెరికన్ దౌత్యకార్యాలయంలో విధులు నిర్వహించే తాత్కాలిక ఉద్యోగి కొండేరు శశిధర్ అమెరికాకు వె ళ్లాలనుకునే వారికి వీసాలిప్పిస్తానంటూ సుమారు 30 మంది దరఖాస్తుదారులను మోసం చేసి రూ.3 లక్షలకుపైగా దండుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతన్ని మరింతలోతుగా విచారించేందుకు సీసీఎస్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో నాంపల్లి కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి శశిధర్ తీసుకోవాలని ఆదేశించింది. దీంతో సీసీఎస్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న శశిధర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
సీసీఎస్ పోలీసుల రాచమర్యాదలు...
పోలీసులు అతన్ని సీసీఎస్‌కు తరలించేందుకు ఏపీ 9పీ 5502 టాటాసుమోలో బయలు దేరారు. అయితే ఇక్కడే నిందితుడితో పోలీసులు కుమ్మక్కయ్యారు. నిందితుడి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల వద్దకు వచ్చారు. వీరందరూ కలిసి నల్గొండ చౌరస్తాలోని సోహెల్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ నిందితుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి, పోలీసులు సైతం బిర్యానీ తిన్నారు. హోటల్ నుంచి మధ్యాహ్నం 3.30కి బయటికి వచ్చారు. కస్టడీలోకి తీసుకున్న నిందితుడికి కుటుంబ సభ్యులతో కలపడం నేరం. అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ హోటళ్లకు తీసుకుపోవడమూ నేరమే. అదను చూసి నేరస్తుడు పారిపోతే పరిస్థితి ఏమిటి..? నిందితుడిని కస్టడీలోకి తీసుకోగానే పోలీసులు అతన్ని నేరుగా సీసీఎస్‌కు తరలించాలి. అయితే ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడే మిలాఖత్ అయిన పోలీసులు రేపు నిందితుడిని ఏమేరకు విచారిస్తారో ఇట్టే అర్థమవుతోంది. అతనికి విందు భోజనం ఏర్పాటు చేయడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.