
ఏటీఎం వ్యాన్‌లో డబ్బు వస్తుందన్నాడు!
∙శేఖర్‌బాబు మాటలు నమ్మే నగదు సమీకరించా
∙మార్పిడి వ్యవహారం అతడికే తెలుసు
∙పోలీసుల విచారణలో ఫజలుద్దీన్ వెల్లడి
సిటీబ్యూరో: ఎంత భారీ మొత్తం పాత కరెన్సీ సమీకరించినా మార్చేద్దామని, బ్యాగులు, సంచులు కాకుండా ఏకంగా ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్లలోనే కొత్త నోట్లు వస్తాయని శేఖర్‌బాబు తనను నమ్మించినట్లు నోట్ల మార్పిడి కేసులో మూడో నిందితుడి ఫజలుద్దీన్ సైఫాబాద్ పోలీసులకు చెప్పాడు. పాత నోట్ల మార్పిడికి యత్నిస్తూ సోమవారం రాత్రి చిక్కిన దళారులను నగదుతో సహా సమావేశపరిచిన ఫజలుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం పదిమంది దళారుల్ని అరెస్టు చేసి, రూ.రూ.3,01,46,000 విలువైన పాతనోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఐదుగురిలో ఫజలుద్దీన్ ఒకడు. తాము సమీకరించిన సొమ్ము రియల్ ఎస్టేట్ వ్యాపారులదేనని నిందితుడు వెల్లడించాడు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన శేఖర్‌బాబుతో రియల్ ఎస్టేట్ లావాదేవీల నేపథ్యంలోనే ఫజలుద్దీన్‌కు పరిచయమైంది. డీమానిటైజేషన్ నేపథ్యంలో పాతనోట్ల మార్పిడికి కుట్ర పన్నిన శేఖర్‌బాబు ఆ విషయాన్ని ఫజలుద్దీన్‌తో చెప్పాడు. ఏటీఎం వాహనాన్ని ఫజలుద్దీన్‌కు చూపించినప్పుడు శేఖర్‌తో పాటు వ్యక్తి ఉన్నాడని, అయితే అతను ఎవరన్నది తనకు తెలియన్నాడు. దీంతో శేఖర్‌బాబు సహా మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
బ్యాంకు అధికారులతో ఉన్న సంబం«ధాల నేపథ్యంలో భారీగా మార్పిడి చేద్దామంటూ శేఖర్‌బాబు చెప్పినందున సోమవారం రాత్రి బషీర్‌బాగ్ మొఘల్స్ కోర్ట్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో తన కార్యాలయానికి దళారులు అందరినీ పిలించానని ఫజలుద్దీన్ అంగీకరించాడు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు నగదు మూలాలు కనుక్కోవడానికి, అసలు వ్యక్తుల్ని గుర్తించడానికి పది మంది దళారుల్నీ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.