పోలీస్ కొలువు.. సాధనతో సులువు | Police jobs .. practice Easy | Sakshi
Sakshi News home page

పోలీస్ కొలువు.. సాధనతో సులువు

Published Mon, Oct 6 2014 10:44 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

పోలీస్ కొలువు.. సాధనతో సులువు - Sakshi

పోలీస్ కొలువు.. సాధనతో సులువు

భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్ది శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించడానికి రెడీగా ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో నగర జనాభా 70 లక్షలకు పైగా ఉందని తేలింది. అయితే కోటిమంది వరకు  సిటీలో ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతమంది ప్రజలకు రక్షణ కల్పించాలన్నా.. నేరరహిత నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని పెంచాలన్నా.. క్షేత్రస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు పోలీసుల నియామకాలు జరగాలి. ఈ క్రమంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి వచ్చే నెలలో ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటికే నగరంలో కానిస్టేబుల్, ఎస్‌ఐ కోచింగ్‌కు అడ్డాగా మారిన దిల్‌సుఖ్‌నగర్‌లో వేల మంది అభ్యర్థులు ఉద్యోగ సాధనే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాలు, అర్హతలు, విధివిధానాలపై ఫోకస్..
 
నవంబర్‌లో నోటిఫికేషన్..

నవ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కొలువులకు ఆగస్టులోనే జరగాల్సిన నియామక ప్రక్రియ మెదక్ ఉప ఎన్నికతో ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల రెండోవారంలో ప్రకటన జారీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. పోస్టుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. సొంతగడ్డపై ఖాకీ జాబ్ పట్టేయాలనే లక్ష్యంతో యువతీ, యువకులు ఇప్పటికే తమ కసరత్తులు మొదలుపెట్టారు. శిక్షణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారితో భాగ్యనగరం కిటకిటలాడుతోంది. కోచింగ్ కేంద్రాలు కొత్తకళ సంతరించుకుంటున్నాయి. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్, అమీర్ పేట, రామాంతపూర్ తదితర ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు సుమారు 40 వేలమందికి పైగా ఉంటారని అంచనా. ఒక్క దిల్‌సుఖ్‌నగర్‌లోనే 10 వేల మంది విద్యార్థులున్నట్లు అక్కడి శిక్షణా సంస్థల నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన సంక్షేమశాఖ సిద్ధమవుతోంది.
 
వేలల్లో ఉద్యోగాలు

దేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటిగా ఉన్న భాగ్యనగరంలో దేశవిదేశాలకు చెందిన ఎన్నో బహుళజాతి సంస్థలున్నాయి. వీటిలో కొన్ని కంపెనీల్లో ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు షిప్టులవారీగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, కాల్‌సెంటర్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య ఎక్కువ. మరోవైపు నగరం మెడికల్ హబ్, ఫార్మా హబ్‌గా అవతరించడంతో వివిధ పనులు, అవసరాల నిమిత్తం లక్షలమంది నగరాన్ని సందర్శిస్తున్నారు. మతపరంగా కూడా హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో శాంతిభద్రతలను కాపాడటం కత్తిమీద సాము. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు ఆకతాయిలు సైబర్ నేరాలకు ఒడిగడుతున్నారు. ఆయా వ్యక్తుల బ్యాంక్ అకౌంట్‌లు హ్యాక్ చేయడం.. అందినకాడికి దోచుకోవడం, ఫేస్‌బుక్ ఖాతాల్లో అసభ్య చిత్రాలను ఉంచడం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాలను అమ్మి సొమ్ము చేసుకునే నైజీరియన్ ముఠాలు నగరంలో పెరిగాయి. చైన్‌స్నాచర్ల భరతం పట్టడానికి, గల్లీ గల్లీలో గస్తీ నిర్వహించడానికి పోలీసులకు మోటారు సైకిళ్లు, అత్యాధునిక వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే.. ఆయా విభాగాల్లో వేలమంది పోలీస్ సిబ్బంది, సంబంధిత నిపుణుల అవసరం ఉంది. డ్రైవర్లు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, ఇన్‌స్పెక్టర్లు, సివిల్ కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, సైబర్ క్రైమ్ నిరోధక నిపుణులు ఇలా ఎంతోమంది సిబ్బంది కావాలి.

అర్హతలు.. వయోపరిమితి

కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్, ఎస్‌ఐ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్‌లో నిర్దేశించిన వయోపరిమితి తప్పనిసరి. సాధారణంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 - 22 ఏళ్లు, ఎస్‌ఐ పోస్టులకు 25 ఏళ్ల వయసు మించకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నిబంధనలకనుగుణంగా రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా నిర్దేశిత ఎత్తు, బరువు, ఛాతీ కలిగి ఉండాలి. ఇతర వైద్య ప్రమాణాలు తప్పనిసరి. పరుగుపందెం, శారీరక సామర్థ్య పరీక్ష, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పురుషులకు నిర్వహించే 5 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో చేరాలనే నిబంధనపై భిన్నవాదనలున్నాయి. గతంలో పరుగు పందెంలో పోటీపడుతూ కొందరు అభ్యర్థులు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ దఫా 5 కి.మీ. పరుగును తగ్గించే అవకాశం ఉండొచ్చని సమాచారం.  పరుగుపందెం, శారీరక సామర్థ్య పరీక్షను అధిగమించినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్ష.. పోస్టులను బట్టి 100 నుంచి 200 మార్కులకు ఉండే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారతీయ చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం, ఇండియన్ పాలిటీ-జాగ్రఫీ-ఎకానమీ, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ స్థాయిలో, ఎస్‌ఐ పోస్టులకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నపత్రం ఉంటుంది.
 
 
10 వేలకు పైగా పోస్టులు


తెలంగాణలో సుమారు 10వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా! వీటిని అంచెలవారీగా భర్తీ చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. తొలి దశలో భాగంగా హోంగార్డు నుంచి ఎస్సై వరకు 6 వేల ఉద్యోగులను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరిగిన ఖాళీలతో మరో వెయ్యి పోస్టులు అదనంగా చేరొచ్చు. హోంగార్డు, కానిస్టేబుల్, ఎస్సైలతోపాటు కొత్తగా సమకూర్చిన 1600 ఇన్నోవాలు, 1550 ఇతర పోలీసు వాహనాలకు అవసరమైన 3260 డ్రైవర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పోస్టుల్లో 3 నుంచి 4 వేల వరకు కానిస్టేబుల్స్, 300 వరకు ఎస్సై పోస్టులు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే ఉండొచ్చు!. చేపట్టబోయే నూతన నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలైతే పోలీసు కొలువులో చేరాలనుకునే మహిళలకు మంచి అవకాశం లభిస్తుంది.
 
శారీరక ప్రమాణాలను పెంచుకోవాలి


పురుషులు.. ఎత్తు 167.6 సెంటీమీటర్లు, ఛాతీ వైశాల్యం 86.3 సెం.మీ కలిగి ఉండాలి. గాలిపీల్చినప్పుడు ఛాతీ 5 సెంటీమీటర్లు పెరగాలి. శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా హైజంప్(1.20 మీ), లాంగ్‌జంప్ (3.80 మీ), షాట్‌పుట్ -7.26 కిలోలు (5.60 మీ), 100 మీ పరుగుపందెం (15 సెకన్లు), 800 మీ. (170 సెకన్లు) పరుగు అంశాల్లో పోటీలు ఉంటాయి. మహిళలు 152.5 సెం.మీ ఎత్తు, కనీసం 40 కిలోల బరువు ఉండాలి. 2.5 కి.మీ. గమ్యాన్ని 16 నిమిషాల్లో అధిగమించాలి. పరుగుపందెం, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్ అంశాల్లో పురుషులతో పోలిస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ అర్హత సాధించిన వారిని మాత్రమే రాతపరీక్షకు అనుమతిస్తారు. పోలీసు శాఖ నియామకాల్లో కీలకమైంది ఎత్తు, బరువు, ఛాతీ కొలత. చాలా మంది యువకులు వీటి విషయంలో పొరపాటు పడుతుంటారు. తీరా 5 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి రెండో అంకానికి చేరాక కానీ వాస్తవం తెలియదు.  ఈ ఇబ్బంది తలెత్తకుండా నిర్ధేశించిన ఎత్తు, బరువు, ఛాతీ ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఛాతీ విస్తీర్ణం పెంచుకునేందుకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, ప్రాణాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నట్లయితే మానేయడం ఉత్తమమని సూచిస్తున్నారు స్పోర్ట్స్ డాక్టర్ ఎస్.భక్తియార్ చౌదరి. 5 కి.మీ. పరుగుపందెంలో ప్రాక్టీసు లేకుండా అప్పటికప్పుడు మైదానంలో దిగి అధిగమించడం కష్టం. కాబట్టి పోటీలో పాల్గొనే యువత కనీసం 3 నెలలు ముందుగానే ప్రాక్టీసు ప్రారంభించాలి. ఆస్తమా, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులున్న వారు ఎంపికకు వెళ్లకూడదు. వంశపారంపర్యంగా గుండె, ఊపిరితిత్తుల వంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ప్రాక్టీసుకు ముందే జనరల్ ఫిజీషియన్‌తో వైద్య పరీక్ష  చేయించుకోవాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement