
పోలీస్ ‘స్వచ్ఛ్ఛభారత్’..!
{పభుత్వ గోడలు, స్తంభాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు అతికిస్తే
పీడీపీపీ యాక్ట్ కింద కేసు
నేటి నుంచి సెక్టార్ల వారీగా స్పెషల్ డ్రైవ్
సిటీబ్యూరో: రహదారులపై ఇక నుంచి విచ్చలవిడిగా రాతలు, ప్రకటనలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు కనిపించవు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పం మేరకు ఇప్పటికే శాంతి భద్రతలో తనదైన ముద్ర వేసిన నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసేవారిపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలపై ఎలాంటి రాతలు రాసినా, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టినా, పోస్టర్లు అతికించినా... బాధ్యులపై ఇక నుంచి ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టూ పబ్లిక్ ప్రాపర్టీ (పీడీపీపీ) యాక్ట్ -1984 కింద కేసులు నమోదు చేయాలని మంగళవారం అన్ని పోలీసుస్టేషన్‌ల అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భవనాలు, ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్లతో పాటు రోడ్లపై ఉన్న స్తంభాలకు విచ్చలవిడిగా ఇవి ఉండటంతో నగర అందం దెబ్బతింటోంది. అంతేకాకుండా ఆయా ప్రభుత్వ విభాగాల విధులకు ఇవి అడ్డంకిగా మారాయి. విద్యాసంస్థలు, వస్త్ర దుకాణాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు ఇలా పలు వర్గాల వారు ఇష్టం వచ్చినట్లు తమ ప్రకటనలను ప్లెక్సీలు, పోస్టర్లు, రాతలు రూపంలో చేసుకోవడంతో నగరంలో చెత్తాచెదారం పెరిగిపోవడంతో పాటు ఒక్కోసారి ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. రోడ్లకు అడ్డంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం వల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ వాహనదారులకు సరిగ్గా కనిపించడం లేదు. ఇక స్తంభాలపై బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం వల్ల ట్రాన్స్‌కో సిబ్బంది కూడా పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్లెక్సీలు కట్టిన కొద్ది రోజులకు వాటి స్వరూపం మారడంతో ఆ రహదారి అందం కూడా కోల్పోతోంది.
సెక్టార్ల వారీగా...
ఆయా పోలీసు స్టేషన్ పరిధిని పరిగణలోకి తీసుకుని నాలుగు నుంచి ఏడు సెక్టార్ల వరకు విభజించారు. ఒక్కో సెక్టార్‌ను ఎస్‌ఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.బుధవారం నుంచి సెక్టార్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపడతారు.