పోలీస్ టెర్రర్!
వందల మంది పోలీసుల్ని పంపి ముద్రగడను అరెస్టు చేయడం దారుణం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ‘‘సామాజిక సమస్యను రాజకీయం చేసి.. శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించి.. పక్కదోవ పట్టించడం చంద్రబాబునాయుడు నైజం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాన్నే అమలు చేయండని ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టారు. మాట ఇచ్చింది.. మోసం చేసింది చంద్రబాబే.. మోసం చేస్తున్నారని ప్రశ్నించడమే తప్పా? ఒక చిన్న గ్రామంలో ఓ ఇంట్లో దీక్ష చేస్తోన్న ముద్రగడ మీదకు వందలాది మందిని పంపి అరెస్టు చేయడం దారుణం. రాష్ట్రంలో అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు రాజ్యంతో భయం సృష్టించే కార్యక్రమాన్ని చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు టైజానికి నాంది పలికారు’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో గురువారం ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రసారం చేస్తున్న సాక్షి టీవీతోపాటు మరో రెండు టీవీచానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని తప్పుపట్టారు. ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాస్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విశ్వరూప్ తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ఏమన్నారంటే..
ఏ స్థాయికైనా దిగజారుతారు..
‘‘రాజకీయాలకోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతారు. ఎన్నికల్లో మాట చెప్పడం.. అవసరం తీరాక దగ్గరుండి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు, మోసం చేస్తారా? అంటూ ప్రజల తరఫున ఎవరైనా నిలదీస్తే వారిపై బండలు వేస్తారు. సీఎం స్థాయి వ్యక్తి, సీఎం రేసులో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పవచ్చా? జవాబుదారీతనం(అకౌంటబులిటీ) లేకపోతే ఎలా? నాయకుల్లో జవాబుదారీతనం రావాలన్నా, వ్యవస్థలో మార్పు రావాలన్నా ప్రజలు తిరగబడాలి. చీపుర్లు చూపించాలి. అప్పుడే నాయకులకు భయం ఉంటుంది. నాయకుల్లో, వ్యవస్థలో మార్పు వస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినదాన్నే చేయండని ముద్రగడ దీక్ష చేపట్టారు. ఓ చిన్న గ్రామంలో ఒక చిన్న ఇంట్లో దీక్ష చేస్తోన్న ముద్రగడ ఇంటికి వందలాది మంది పోలీసులను పంపారు. గ్రామ జనాభా కన్నా పోలీసులే అధికంగా ఉన్నారు. పోలీసు బలంతో నిరంకుశంగా ముద్రగడను అరెస్టు చేయడం దారుణం. ముద్రగడ కుమారుడిని నిర్దాక్షిణ్యంగా పోలీసులు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇంతకంటే దారుణముందా?
భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తారా?
అనుకూల మీడియాకు ముద్రగడ వార్తలను ప్రసారం చేయొద్దంటూ ఆదేశాలిచ్చిన చంద్రబాబు ఏకపక్షంగా ఎమర్జెన్సీని తలపిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ సాక్షి టీవీతోపాటు మరో రెండు చానళ్ల ప్రసారాలను కట్ చేయడం దారుణం. మీడియా ప్రసారాలను నిలిపేయడం సరికాదు. ఈరోజున సాక్షి చానల్ ప్రసారాలను కట్ చేశారు. భవిష్యత్తులో మిగిలిన చానళ్లను కట్ చేయరు అని చెప్పడానికి లేదు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటిరోజు. అందరూ కలసికట్టుగా ప్రభుత్వ చర్యలను ఖండించాలి. సాక్షి చానల్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఎన్నో వార్తలను ప్రసారం చేసినా.. ఏ ఒక్క చానల్‌ను కట్ చేయలేదు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలకు చానళ్లు ఉన్నాయి.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరో పార్టీకి చెందిన చానల్‌ను కట్ చేసిన సందర్భాలు లేవు. రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి చంద్రబాబు తెరలేపడం దారుణం. ఇది మంచి సంప్రదాయం కాదు. దీన్ని అందరూ ఖండించాలి.
భయోత్పాతం సృష్టిస్తున్నారు..
ఒక సామాజిక సమస్యను రాజకీయం చేసి.. శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించి పక్కదోవ పట్టించడం చంద్రబాబు నైజం. ఎస్సీ వర్గీకరణ విషయంలో బాబు ఏం చేశారు.. కులాలమధ్య చిచ్చుపెట్టారు. ఇప్పుడు ఒకే కులంలోనే ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతున్నారు. వాగ్దానం చేసింది. మోసం చేసింది చంద్రబాబే. మోసం చేస్తారా? అని ప్రజల తరఫున నిలదీసే వారిపై దొంగ కేసులు పెట్టి భయోత్పాతం సృష్టిస్తున్నారు. సామాజిక సమస్యపై ముద్రగడ చేస్తోన్న ఉద్యమానికి మద్దతివ్వడం తప్పా? ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి.. అవసరం తీరాక మోసం చేస్తే తిరగబడక ప్రజలు ఏం చేస్తారు?
సీబీఐ విచారణకు సిద్ధమా?
విధ్వంసాల చరిత్ర చంద్రబాబుదే. తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్సులు ధ్వంసం చేయండి.. రైళ్లు దగ్ధం చేయండి.. విధ్వంసం సృష్టించండి అంటూ చంద్రబాబునాయుడు ఫోన్‌లు చేశారని ముద్రగడే చెప్పారు. పరిటాల రవి హత్య జరిగిన సమయంలోనూ, ఎన్‌టీ రామారావు దిగిపోయిన సమయంలోనూ విధ్వంసాలు సృష్టించాలని చంద్రబాబే ఆదేశించారని ముద్రగడ చెప్పారు. అలాంటి చంద్రబాబుకు తుని ఘటనపై మాట్లాడే నైతిక హక్కు లేదు. తుని ఘటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే తుని ఘటనపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలి.
తన చెప్పుచేతల్లోనే ఉండే సీఐడీతో తనకు నచ్చనివారిపై దొంగ కేసులు పెట్టించి.. ఇబ్బంది పెట్టడం సరికాదు.. సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.. తుని ఘటనలో చంద్రబాబు పాత్ర వెల్లడవుతుంది’’ అని జగన్ అన్నారు. తుని ఘటనలో విధ్వంసానికి పాల్పడింది రాయలసీమకు చెందిన వ్యక్తులేనని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపిస్తే ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారినే సీఐడీ అరెస్టు చేస్తోన్న అంశాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా జగన్ బదులిస్తూ.. ప్రజల తరఫున నిలదీసే వారిపై బండలు వేయడం చంద్రబాబు నైజమని, తుని ఘటనపై థర్డ్ పార్టీ.. సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని, తుని విధ్వంసంలో చంద్రబాబు పాత్ర బయటపడుతుందని స్పష్టీకరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, అరెస్ట్ చేసిన ముద్రగడను విడుదల చేయాలని, కట్ చేసిన సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.