వివరాలు వెల్లడిస్తున్న రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ ఉమేందర్
♦ వేధింపులు భరించలేకే....
♦ హత్య కేసులో వీడిన మిస్టరీ
అత్తాపూర్: హత్య కేసు మిస్టరీని రాజేంద్రనగర్ పోలీసులు చేధించారు. ఈ నెల 4న అత్తాపూర్ సమీపంలోని మూసినదిలో రవీందర్ అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య, కుమారుడే అతడిని హత్య చేసినట్లు గుర్తించారు. బుధవారం ఇన్‌స్పెక్టర్ కేసు వివరాలను వెల్లడించారు.వికారాబాద్ జిల్లా కులచర్ల ప్రాంతానికి చెందిన కోట్ల రవీందర్(44), కోట్ల సత్యవతి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పంజాగుట్టలోని ద్వారాకపూరి కాలనీలో నివాసం ఉంటున్నారు. తాగుడికి బానిసైన రవీందర్ ప్రతి రోజూ భార్యను కొట్టడమేగాక, మానసికంగా వేధించేవాడు. ఈ నెల 3న అతను ఇంట్లో రూ.3వేలు తీసుకెళ్లి తాగి రావడంతో సత్యవతి అతడిని నిలదీసింది. దీంతో అతను భార్యను కొట్టడమేగాక కుమారుడితోనే వివాహేతర సంబంధం అంటగట్టడంతో ఆగ్రహించిన సత్యవతి కిందపడేసి పక్కనే ఉన్న రుబ్బురోలుతో తలపై మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ విషయాన్ని కుమారుడు సాయికుమార్‌కు ఫోన్ చేసి చెప్పడంతో ఇంటికి వచ్చిన అతను కూడా రవీందర్‌పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సాయికుమార్ తన స్నేహితుడు మియాపూర్ ప్రాంతానికి చెందిన వడ్ల నరేష్‌చారిని పిలిపించుకుని అతని సహకారంతో నీళ్ల డ్రమ్ములో రవీందర్ మృతదేహాన్ని అందులో ఉంచారు. అనంతరం ఒక ట్రాలీ ఆటోను షాద్‌నగర్ వెళ్ళాలని కిరాయి మాట్లాడుకున్నారు. దారిలో ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్న సాయి భయంతో వణుకుతుండటాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ ఆటోను పక్కకు ఆటో నిలిపి డ్రమ్ములో ఏమున్నాయని నిలదీయడంతో వారు అసలు విషయం చెప్పారు. దీంతో అతను వారిని పిల్లర్ నెంబర్ 118 వద్ద వదిలి వెళ్ళిపోయాడు. అనంతరం ముగ్గురు కలిసి మృతదేహాన్ని మూసిలో పడవేసి అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి జేబులో లభ్యమైన ఆధారాల ద్వారా కేసు మిస్టరీని చేధించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కేసును చేధించిన ఎస్సై వెంకట్‌రెడ్డి, నారాయణరెడ్డిలను ఇన్‌స్పెక్టర్ తఅభినందించారు.