పొలిటికల్ ‘బౌన్సర్లు’! | Political 'bouncers'! | Sakshi
Sakshi News home page

పొలిటికల్ ‘బౌన్సర్లు’!

Published Sat, Jan 23 2016 1:27 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

పొలిటికల్ ‘బౌన్సర్లు’! - Sakshi

పొలిటికల్ ‘బౌన్సర్లు’!

♦ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నేతాశ్రీల వెంట ప్రత్యక్షం
♦ సరఫరాకు కీలక కేంద్రాలుగా జిమ్‌లు
♦ ఇతర ప్రాంతాల నుంచీ బౌన్సర్ల ‘దిగుమతి’
♦ అపశ్రుతులకు తావులేకుండా పోలీసుల చర్యలు
 
 ఎలక్షన్‌లో ఎన్నెన్నో వింతలు..విశేషాలు. ప్రచారంలో వింత పోకడలు. గల్లీగల్లీలో అభ్యర్థుల చక్కర్లు. వారి వెంట నయా నయా వ్యక్తులు. ఆరా తీస్తే...వారు బౌన్సర్లు. అవును..గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనేతలు కొందరు ఇప్పుడు ప్రచారంలో వారి వెంట బౌన్సర్లను నియమించుకుంటున్నారు. పర్యటనలు, ప్రచారంలో ఎలాంటి అపశ్రుతులు లేకుండా..జనాలను అదుపు చేయడంతోపాటు కాస్త హంగు ఆర్భాటాలను ప్రదర్శించేందుకూ బౌన్సర్లు ఉపయోగపడుతున్నారు. ఎలక్షన్ గిరాకీతో నగరంలో బౌన్సర్ల కొరత సైతం ఏర్పడిందట. ఇతర ప్రాంతాల నుంచీ వీరిని రప్పిస్తున్నట్లు వినికిడి.     - సాక్షి, సిటీబ్యూరో
 
 ‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో కేవలం ప్రచార సామాగ్రికి మాత్రమే కాదు... బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. వీరు నగర వ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు, చోటా మోటా నేతల వెంట తిరగడానికి ఇతర ప్రాంతాల నుంచీ ‘దిగుమతి’ అవుతున్నారు. హంగుఆర్భాటం కోసం ఆయా నేతలు సైతం వీరిని వెంటేసుకుని తిరుగుతున్నారు. ఈ బౌన్సర్ల కారణంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. సాధారణంగా నల్లరంగు దుస్తుల్లో కనిపించే ఈ బౌన్సర్లు ఎలక్షన్ నేపథ్యంలో పొలిటికల్ టచ్ కోసం ఖద్దరు, సఫారీల్లోకి మారుతున్నారు.

 బార్ల నుంచి బహిరంగ ప్రదేశాలకు...
 బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్లకు తరచూ వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని క ట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాంలో వీరు దర్శనం ఇస్తుంటారు. అయితే ఎన్నికల నేపథ్యంలో చోటా స్థాయి నుంచి ఓ మాదిరి నాయకుడి వరకు వీరిని నియమించుకున్నారు. యూనిఫాం మాత్రం నలుపు డ్రస్ నుంచి సఫారీకో ఖద్దరుకో మారుతోంది. కొందరు బాడీ బిల్డర్లయితే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరికి రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ‘జీతం’ లభిస్తోందని వినికిడి.

 గన్‌మెన్ ముచ్చట తీరుతోంది...
 ఈ బౌన్సర్లను సఫారీ దుస్తుల్లో తమ వెంట తిప్పుకుంటున్న నేతలు గన్‌మెన్ ముచ్చట తీర్చుకుంటున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోలీసు విభాగం వ్యక్తిగత భద్రతాధికారుల్ని కేటాయిస్తుంది. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా పోటీ పడేవారికి ఆ చాన్స్ లేకపోవడంతో ఇలా సర్దుకుపోతున్నారు. ఎన్నికలు లాంటి సందర్భాలతో పాటు ప్రముఖుల రాక, భారీ స్థాయిలో సాంసృ్కతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర సందర్భాల్లో రక్షణ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేయడానికి నగరంలో అనేక సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం సిద్ధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా సినీ తారల స్టేజ్ షోలు, నటీ నటుల చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాల్లో జనాన్ని అదుపు చేయడానికి వీరి అవసరం ఎక్కువగా ఉంటోంది.

 కరుకుదనం తగ్గితే చాలంటూ...
 దేహదారుఢ్యంతో పాటు కాస్త చురుకుదనం, సమయస్ఫూర్తి మాత్రమే ప్రధాన అర్హతలు కావడంతో జిమ్స్‌తో టచ్‌లో ఉండే అనేక మంది యువకులు తాత్కాలిక బౌన్సర్లుగా ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారినే ప్రస్తుతం రాజకీయ నాయకులు నియమించుకున్నారు. అయితే ప్రచారం నేపథ్యంలో ఎక్కడా కరుకుదనం ప్రదర్శించవద్దని ఆయా నేతలు ముందే షరతు విధిస్తున్నారట. పోలింగ్‌కు ముందు మూడు రోజులూ ప్రతి అభ్యర్థికీ కీలకమైనవి. ఆ సమయంలో ఈ బౌన్సర్లకు గిరాకీ మరింత పెరగనుంది. మరోపక్క పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొత్త వారి కదలికలపై కన్నేసి ఉంచుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement