పెట్రోల్ పోసి...నిప్పంటించి..!
వేర్వేరు చోట్ల దారుణాలు
ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు
నగరంలో కలకలం
నిందితుల కోసం గాలింపు
రాంగోపాల్‌పేట్: నగరంలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించారు. మహంకాళి, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో గురువారం చోటుచేసుకున్నఈ సంఘటనలు కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ... న్యూబోయిగూడలో నివసించే నర్సింగరావు (30) ప్రతి గురువారం బోయిగూడ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలోని సాయిబాబా గుడి వద్ద కొబ్బరి కాయలు విక్రయిస్తుంటారు. మిగిలిన రోజుల్లో బెలూన్ల వంటి చిన్నచిన్న వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆయనకు భార్య దుర్గాలక్ష్మితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా భార్యతో గొడవపడి ఇంటికి వెళ్లకుండా సాయిబాబా గుడి వద్ద ఫుట్‌పాత్‌పైనే నర్సింగరావు పడుకుంటున్నారు. బుధవారం రాత్రి అక్కడే పడుకోగా... అర్థరాత్రి 1.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యారు.
బాధతో అతను కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు.. మార్కెట్ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే గురువారం తెల్లవారు జామున 3.30- 4 గంటల మధ్య ఓ ఆటో డ్రైవర్‌పై ఇదే తరహాలో దాడి జరిగింది.మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన ఆనంద్ (55) ఆటో డ్రైవర్. నూర్‌ఖాన్ బజార్‌లో ఆటో అద్దెకు తీసుకుని నడిపిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆయనకు భార్య శశికళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గురువారం తెల్లవారు జామున ఆర్పీ రోడ్‌లోని బాటా చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ఆటో ఆపి అందులోనేనిద్రిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆనంద్‌ను హుటాహుటిన పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహంకాళి ఏసీపీ ఎం.తిరుపతి వచ్చి బాధితులతో మాట్లాడి, వివరాలు సేకరించారు. బాధితుల వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ స్వీకరించారు. నర్సింగరావుకు 20 శాతం, ఆనంద్‌కు 50శాతం కాలిన గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం వారిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు.
రెండు ఘటనలతో కలకలం
కొద్ది గంటల వ్యవధిలో ఒకే తరహాలో రెండు ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ నెల 4నహనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో విజయ యాత్ర నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఈ సంఘటనలు చోటుచేసుకోవడం పోలీసుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్, మహంకాళి డివిజన్ ఎస్‌ఐలు, సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలను నియమించారు.
సీసీ కెమెరాలో దృశ్యాలు
ఈ రెండు ఘటనలకు సంబంధించి నిందితుల ఆచూకీ కోసం పరిసరాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సాయిబాబా గుడి వద్ద ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు రెండు, మూడుసార్లు అక్కడే తిరిగిన దృశ్యాలు ఉన్నాయి. అవి అంత స్పష్టంగా లేకపోవడంతో నిఫుణులతో వాటిని డెవలప్ చేయించే పనిలో పడ్డారు. బాటా వద్ద ట్రాఫిక్ కెమెరాలు పనిచేయకపోవడంతో అక్కడ కొంత ఇబ్బంది ఎదురవుతోంది. చిత్ర దర్గ ప్రాంతంలోని సీసీకెమెరాను పరిశీలిస్తున్నారు.