
చిలిపి భాష
వెన్యూ
లిపి లేని భాషలు వెరైటీ భావాలను తెలుపుతాయి. కనుసైగలు.. పెదవి విరుపులు.. మాటలకందని ఊసులను పంచుతాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి సరికొత్త భాషొకటి వచ్చి చేరింది. సిటీలో యూత్ అంతా ఇప్పుడు ఈ భాషలోనే క మ్యూనికేట్ అవుతున్నారు. ప్రేమించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు.. పొగుడుతున్నారు.. తిడుతున్నారు. లిపి లేని చిలిపి మాధ్యమాన్ని కనుగొని అందులో ఫుల్
ఎంజాయ్ చేస్తున్నారు.
..:: ఎస్.సత్యబాబు
‘కాలేజ్‌కి బంక్ కొడదామా?’.. ‘కొట్టి?’.. ‘మూవీకి పోదాం’.. ‘నో..షాపింగ్‌మాల్’.. ‘డన్’.. ఇలా చిన్న చిన్న వాక్యాలను పదాల స్థాయికి కుదించి మాట్లాడుకునే షార్ట్‌కట్ లాంగ్వేజ్ కాస్తా.. ఇప్పుడు పెదవి మెదపకుండానే స్మార్ట్‌కట్‌లో మాట్లాడేస్తున్నారు. వేళ్ల కదలికలతోనే తెగ సంభాషించుకుంటున్నారు.
వేళ్లే.. నోళ్లై
వెరైటీ కమ్యూనికేషన్లకు నిలయమైన పాశ్చాత్య ప్రపంచమే ఈ విచిత్రమైన వేళ్ల ‘లింగ్వో’కూ నాంది పలికింది. అలా అలా అది విశ్వవ్యాప్తమైంది. చాలా కాలం నుంచే చిన్నా పెద్దా అందరికీ అలవాటైన థంబ్స్ అప్.. ప్రముఖ నాయకుల, సెలబ్రిటీల ద్వారా పాపులరైన విక్టరీ సింబల్.. అలా ఒకటీ అరా మాత్రమే నిన్న మొన్నటి వరకు మనకు తెలిసినవి. ఇప్పుడు సిటీ యూత్ వేళ్లతో ఆడుకుంటోంది. ఏదైనా పనికి వెళ్తుంటే చెప్పే‘గుడ్ లక్’ మొదలు.. అభినందించడానికి వాడే ‘శభాష్’ వరకూ అన్నీ వేళ్లతోనే చూపిస్తున్నారు. విమర్శించడం, వెక్కిరించడం కూడా ఫింగర్స్‌తో పోజులు చూపిస్తున్నారు. ఎన్నో పదాలు యువత వేలి ముద్రలతో విడుదలవుతున్నాయి. ఈ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ఫొటోల్లో సైతం సింబాలిక్ సైన్ చూపకుండా ఉండటం లేదు. వాట్సప్ పుణ్యమాని అదింకా పెరిగింది. మెసేజ్‌లకు ఫింగర్ లాంగ్వేజ్‌లో రిప్లైలు పంపిస్తున్నారు.
‘వేల’ అర్థాలు..
విదేశీ కల్చర్ మోసుకొచ్చిన ఈ హ్యాండ్ గెశ్చర్స్‌కు విస్తృత అర్థాలు ఉన్నాయి. ప్రాంతాలు, మతవిశ్వాసాలు, ఆచారాల వారీగా ఇవి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కొన్నిటికి యూనివర్సల్ మీనింగ్ ఒకటే ఉన్నా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అర్థం వచ్చే హ్యాండ్ గెశ్చర్స్ కూడా ఉన్నాయి. సరికొత్త లాంగ్వేజ్ మోజులో పడిన ఈ తరం మాత్రం కొన్నింటికి అర్థాలు తెలియకున్నా విరివిగా వాడేస్తోంది. ముఖ్యంగా అమెరికన్ హ్యాండ్ గెశ్చర్స్‌ను అధికంగా ఇమిటేట్ చేస్తున్న కుర్రకారు పలు దేశాల్లో వీటికి సంబంధించిన అర్థాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు సిటీ ఎటికెట్ ట్రైనర్స్. వేళ్ల భాష వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరని చెబుతున్నారు. లేకపోతే.. విదేశాలకు వెళ్లినపుడు ఈ భాష ప్రయోగిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని...
ది ఓకే..
అంతా బాగుంది అనడానికి చిహ్నంగా మనం చూపుడు వేలిని బొటనవేలి మీదికి ఇలా మడిచి చూపిస్తాం. అయితే ఫ్రాన్స్‌లో దీనికి అర్థం జీరో లేదా వర్త్‌లెస్ అని. ఇక వెనెజులా, టర్కీ, బ్రెజిల్ దేశాల్లో దీనికి అసభ్యకరమైన అర్థాలూ ఉన్నాయి.
థంబ్స్ అప్...
అంగీకారానికి చిహ్నంగా థంబ్స్ అప్ సిగ్నల్ ప్రాచుర్యంలో ఉంది. అయితే అఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఇటలీలోని కొన్ని ప్రాంతాలు, గ్రీస్‌లలో ఈ సింబల్‌కి ‘అప్ యువర్స్’ అని అర్థం. అక్కడ ఎదుటి వ్యక్తిని అవమానించడానికి చిహ్నంగా తీసుకుంటారు. లాటిన్ అమెరికా, గ్రీస్‌లోనూ అంతే. థంబ్స్ డౌన్ చేస్తే- ఒప్పుకోను, లేదా ఓటమి, లేదా తిరస్కారానికి చిహ్నంగా భావిస్తారు.
వి సైన్..
వి ఫర్ విక్టరీ అనే సింబల్ వరల్డ్ వార్ 2 సమయంలో మొదలై బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని అమెరికాలో హిప్పీ మూవ్‌మెంట్ సమయంలో శాంతికి గుర్తుగా వాడేవారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జపాన్, చైనా, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, తైవాన్ దేశాల్లో ఇదే గెశ్చర్‌ని కాస్త మార్పుతో అంటే అరచేయి మన వైపు ఉంచి వి సింబల్‌ని చూపితే ఫొటో తీయించుకుంటున్న వ్యక్తి అందంగా, చూడచక్కగా ఉన్నట్టు చెప్పడమట. ఏదేమైనా యూకే, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, న్యూజిలాండ్‌లలో దీన్ని ప్రమాదకరమైన హెచ్చరికగా భావిస్తారు.
చిన్‌ఫ్లిక్...
ఈ తరహాలో సంజ్ఞ చేయడాన్ని చిన్ ఫ్లిక్ అంటారు. ఇలా చూపిస్తే బెల్జియం, ఫ్రాన్స్, నార్తన్ ఇటలీ, ట్యునీసియాలలో గెట్‌లాస్ట్ అని అర్థం. పొమ్మని చాలా దురుసుగా చెప్పడం దీని అంతరార్థం.
ఫింగర్ సమ్మనింగ్..
ఎవరైనా వ్యక్తిని రమ్మనడానికి వేలిని ఇలా మడిచి పిలుస్తాం కదా. అయితే ఫిలిప్పీన్స్‌లో అలా కుక్కని పిలవడానికి మాత్రమే వాడతారు. సింగపూర్, జపాన్‌లలో ఇది డెత్‌కు ‘సింబాలిక్’.
లాసర్...
బొటనవేలిని చూపుడు వేలిని ఇలా ‘ఎల్’ షేప్‌లో మడిచి చూపడాన్ని నువ్వు లాసర్‌వి అని వెక్కిరించడానికి లేదా తను లాస్ అయ్యానని తెల్ల ముఖం వేయడానికీ వినియోగిస్తున్నారు. 1990లో విడుదలైన ఏస్ వెంచురా, డిటెక్టివ్, ది సాండ్లోట్.. వంటి హాలీవుడ్ చిత్రాలు దీన్ని పాపులర్ చేశాయి. ఫిలిప్పీన్స్‌లో దీన్ని ఫైట్ చేయడానికి సింబల్‌గా కూడా వాడుతుంటారు.
హార్న్స్ లేదా హార్న్ ఫింగర్స్...
రాక్‌షోలలో రాక్‌స్టార్స్ వినియోగించే రాక్ ఆన్ లేదా లవ్ అనే అమెరికన్ సైన్‌ని ఇప్పుడు అన్నిచోట్లా విరివిగా వాడుతున్నారు. ఇదే సింబల్‌ని బ్రెజిల్, కొలంబియా, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్‌లలో కొర్నా అంటారు. ఈ దేశాల్లో అభ్యంతరకరంగా భావిస్తారు.
క్యూటిస్...
ఈ సింబల్‌కి ‘నిన్నే కాదు నీ కుటుంబాన్నీ లెక్క చేయన’ని అర్థం.
ఫింగర్స్ క్రాస్డ్..
గుడ్‌లక్ అని చెప్పడానికి క్రాస్డ్ ఫింగర్స్‌ని చూపిస్తాం. క్రిస్టియానిటీలో సైతాన్ నుంచి రక్షించమని దేవుడ్ని కోరుకోవడానికి కూడా ఇలా వ్యక్తపరుస్తారు. ఇక వియత్నాంలో క్రాస్డ్ ఫింగర్స్ చూపడాన్ని అభ్యంతరకరంగా భావిస్తారు.