శుక్రవారం నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర ప్రతి ప్రణబ్ ముఖర్జి తన శీతాకాల విడిదిలో బస చేయనున్నారు. ఏటా శీతాకాలంలో కొద్ది రోజుల పాటు.. హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో రాష్ట్రపతి బస చేయడం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18 తేదీ ఉదయం రాష్ట్ర పతి సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు.
డిసెంబర్ 22, 23 తేదీల్లో కర్ణాటక లో పర్యటిస్తారు. కర్ణాటక పర్యటనలో భాగంగా గుల్బర్గాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక రెండో స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. అదే రోజు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ భవనాన్ని ప్రారంభించిన జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరుసటి రోజు బిషప్ కాటన్ బాలుర పాఠశాల 150వ వార్షికోత్సవానికి హాజరు కానున్నారు. తర్వాత స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కి శంఖుస్థాపన చేయనున్నారు.
25న భీమవరంలో టీటీడీ ఏర్పాటు చేసిన వేద పాఠశాల ను ప్రారంభించనున్నారు. 27న ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. అదే రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న ఆయత చండీ యాగంలో పాల్గొంటారు. 29న రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. కాగా రాష్ట్ర పతి పర్యటనలో చివరి రోజు.. డిసెంబర్ 30న రాష్ట్ర పతి సీనియర్ అధికారులు, రాష్ట్ర మంత్రులు, జర్నలిస్టులకు విందు ఇవ్వనున్నారు.
కాగా.. ఇప్పటికే సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్ర పతి నిలయం.. ప్రణబ్ ముఖర్జి పర్యటన కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిలటరీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తైయ్యాయి.