
మరిన్ని విజయాలతో మీ ముందుకు వస్తా
మున్ముందు మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని పతకాలతో మళ్లీ మీ అందరి ముందుకు వస్తానని ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు తెలిపింది. రియోలో పతకం సాధించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు అపురూపమైన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి గచ్చిబౌలి స్టేడియానికి వచ్చేవరకు అడుగడుగునా పుష్పగుచ్ఛాలు, దండలతో వాళ్లను ముంచెత్తారు. అనంతరం స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ''మీ అందరి మద్దతు, ఆశీర్వాదాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇందుకు గాను మా గురువు గోపీచంద్‌కు చాలా థాంక్స్. మా తల్లిదండ్రులు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్, కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు స్టేడియానికి ఇంతమంది వస్తారని ఏమాత్రం అనుకోలేదు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి మళ్లీ మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను'' అన్నారు.
సింధు స్ఫూర్తితో మున్ముందు మరింతమంది మరిన్ని పతకాలను దేశానికి తీసుకురావాలని సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఇంత మంచి స్వాగతం ఏర్పాటుచేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు అని తెలిపారు. విమానాశ్రయం నుంచి వస్తుంటే దారి పొడవునా చిన్నా పెద్దా అందరూ సాదరంగా స్వాగతం పలికారని, మాకు ఇన్ని రోజుల నుంచి మద్దతిచ్చిన మీకు, ప్రభుత్వానికి చాలా చాలా ధన్యావాదాలని అన్నారు. ఇక్కడకు వచ్చిన చాలామంది లాగే తాను కూడా 2000 సంవత్సరంలో కరణం మల్లేశ్వరి పతకం గెలిచినప్పుడు ఆమెను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. ఇప్పుడు ఉన్న పిల్లల్లో కూడా చాలామంది సింధును స్ఫూర్తిగా తీసుకుని మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు తెస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మీరు అందిస్తున్న సహకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. క్రీడల్లో కూడా మన రాష్ట్రం ముందు నిలుస్తుందని భావిస్తున్నానని తెలిపారు.
తెలంగాణ నుంచి దేశం పేరు ప్రఖ్యాతులను పెంచేలా ఒలింపిక్స్‌లో గెలవడం సంతోషించదగ్గ విషయమని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు
''ప్రపంచస్థాయికి తెలంగాణ గౌరవాన్ని కాపాడినందుకు సింధును అభినందిస్తున్నాం. క్రీడాకారులను ఇంకా ప్రోత్సహించడానికి సీఎం ఇంకా చాలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ క్రీడాకారులంతా సింధును ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాం'' అని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు.
''గోపీచంద్ ఇంతమంది ఛాంపియన్లను ఎలా తయారుచేశారో తెలుసుకోడానికి మీరు వచ్చారు.. ప్రధానమంత్రి బేటీ బచావో, బేటీ పఢావో అన్నారు. ఇద్దరు బేటీలు భారతదేశాన్ని బచాయించారు. దేశ కీర్తిపతాకాన్ని ప్రపంచంలో నిలబెట్టారు. మీ అమ్మాయి భారతదేశ పుత్రికగా ఎదిగింది.. అందుకు రమణ, విజయలకు అభినందనలు. మీ త్యాగాల నుంచి కోచ్ శిక్షణ నుంచే ఆమె ఇంత స్థాయికి ఎదిగింది. మంచి క్రీడా విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. సింధు వెనకే ఉండి గోపీ మంత్రాలు చదివారు.. ఆ మంత్రాలు ఏంటో మాకు చెప్పలేదు గానీ, అవే ఆమెకు పతకం సాధించిపెట్టాయి'' అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
''ఒలింపిక్ ఛాంపియన్‌గా దేశ కీర్తిప్రతిష్ఠలను సింధు, ఆమె గురువర్యులు గోపీచంద్, తల్లిదండ్రులతో పాటు మా అందరికీ ఇది చాలా సంతోషకరమైన రోజు. దేశ పరువును నిలబెట్టింది ముగ్గురూ ఆడబిడ్డలే. సింధు, సాక్షి మాలిక్ పతకాలు సాధించగా దీపా కర్మాకర్ కూడా శాయశక్తులా ప్రయత్నించింది. భవిష్యత్తులో తప్పకుండా గోల్డ్ మెడల్ వస్తుంది'' అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.
''జై సింధు.. జై తెలంగాణ.. జై హింద్. దేశం పేరు, తెలంగాణ పేరు నిలబెట్టిన సింధుకు, ఆమె తల్లిదండ్రులకు అభినందనలు. సీఎం కేసీఆర్ నెంబర్ 1 సీఎం అయితే సింధు ప్రపంచంలోనే నెంబర్ 2గా నిలిచింది. సింధు స్ఫూర్తితో తెలంగాణ నుంచి మరింత మంది మరిన్ని పతకాలు తేవాలి. సింధు కూడా ఈసారి తప్పనిసరిగా స్వర్ణపతకం సాధిస్తుంది'' అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.