olympic medal winner
-
సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం
-
సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం
పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా.. తెలంగాణ అమ్మాయా అన్న అనుమానం అక్కర్లేదు. ఆమె కర్ణాటక అమ్మాయి అని హరియాణా సీఎం తేల్చేశారు. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించి రియోలో భారతదేశానికి తొలి పతకం అందించిన సాక్షి మాలిక్‌ను ఆమె సొంత రాష్ట్రం హరియాణాలో ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆమెకు రూ. 2.5 కోట్ల పురస్కారం అందించారు. అయితే.. అదే సందర్భంలో పీవీ సింధు విషయంలో మాత్రం ఆయన మాట తడబడ్డారు. సింధును కర్ణాటకకు చెందిన అమ్మాయి అని చెప్పారు. చివరకు ఆమె పేరు కూడా సరిగా పలకలేదు. వరుసపెట్టి టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్.. ఇలా చాలా క్రీడల్లో ఒక్క పతకం కూడా రాక భారతీయులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయిన తరుణంలో సాక్షి మాలిక్ దేశానికి మొట్టమొదటి పతకం అందించింది. రియో నుంచి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీలోను, తర్వాత హరియాణాలోను కూడా ఘన స్వాగతం లభించింది. అయితే.. సాక్షిమాలిక్‌ను సత్కరించే సందర్భంలో హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సింధు పేరేంటో మర్చిపోయారు. అంతేకాక, ఆమెను కన్నడ అమ్మాయి అని చెప్పారు. నిజానికి మంత్రులు ఒలింపిక్ క్రీడాకారులను మర్చిపోవడం ఇది మొదటిసారి ఏమీ కాదు. దీపా కర్మాకర్ పేరును సాక్షాత్తు కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ తప్పుగా చెప్పారు. -
ఆమెకు ఏపీలో అంతా 'ప్రత్యేకమే'
రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం అందుకున్న పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే స్థాయిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనల కోసం ఉపయోగించే ప్రత్యేక విమానాన్ని సింధు కోసం పంపారు. ఎప్పుడూ సాధారణ విమానాలు వెళ్లే శంషాబాద్ విమానాశ్రయం నుంచి కాక.. వీఐపీల కోసం మాత్రమే ఉపయోగించే బేగంపేట విమానాశ్రయం నుంచి.. ఈ ప్రత్యేక విమానంలో పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు, కోచ్ గోపీచంద్ అంతా బయల్దేరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వయంగా వాళ్లను తోడ్కొని హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. -
టిఫిన్ తిని ఎన్నాళ్లయింది!!
ఒలింపిక్ పతకాలు సాధించడం అంటే చిన్న విషయం కాదు. దాని వెనుక కఠోర శ్రమ ఉంటుంది, అపారమైన త్యాగాలుంటాయి.. చివరకు తమకు ఎంతో ఇష్టమైన తిండి కూడా తినలేక కడుపు మాడ్చుకోవాల్సి ఉంటుంది. పతకం సాధించి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ తన చేత్తో వండిపెట్టిన కమ్మటి టిఫిన్ తింటుంటే 'ఎన్నాళ్లయింది' అనుకోవడం సహజం. ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్యపతకం సాధించిన సాక్షి మాలిక్ సరిగ్గా ఇలాగే అనుకుంది. 12 ఏళ్ల కష్టం, ఓర్పు, త్యాగాల ఫలితంగా ఆమెకు పతకం వచ్చింది. రియోలో సాధించిన విజయం తాలూకు సంబరాలు ముగిసిన తర్వాత.. ఇప్పుడు ఆమె తనకు ఇష్టమైన పని చేస్తోంది. అవును.. మంచి టిఫిన్ తింటోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫొటోతో సహా ట్వీట్ చేసింది. ప్లేటు నిండా టిఫిన్ పెట్టుకుని, కావల్సినవి నంజుకుని తింటూ ఆస్వాదించి ఎన్నాళ్లయిందో అంటూ ఆమె ఆనందంగా చెప్పింది. టిఫిన్ తింటున్న ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. సాక్షి మాలిక్ మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుది కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో సంబరాలు ముగిసిన తర్వాత ఆమె నేరుగా ఇంటికి వెళ్లి అమ్మ చేసిపెట్టిన బిర్యానీ, మైసూర్‌పాక్ తింది. దాదాపు మూడు నెలలుగా ఆమెకు దూరం చేసిన ఫోన్ తిరిగిస్తానని కోచ్ గోపీచంద్ చెప్పారు. దాంతోపాటు ఇన్నాళ్ల నుంచి ఆమెకు ఎంతో ఇష్టమైన తీపి పెరుగు, ఐస్‌క్రీం కూడా తిననివ్వలేదు. ఇక జిమ్నాస్టిక్స్‌లో నాలుగోస్థానం వచ్చినా, తన అద్భుతమైన ప్రదర్శనతో 125 కోట్ల మంది భారతీయుల హృదయాలను ఆకట్టుకున్న దీపా కర్మాకర్ కూడా పోటీలు ముగిసిన తర్వాత కావల్సినంత ఐస్‌క్రీమ్, స్ట్రాబెర్రీలు తినేసింది. ఫైనల్ ముగిసిన రెండు రోజుల తర్వాత తాను ఐస్‌క్రీంతో పాటు స్ట్రాబెర్రీ స్మూతీలు తిన్నానని, గత మూడు నెలల్లో తాను ఇలా తినడం ఇదే మొదటిసారని ఆమె చెప్పింది. కాబట్టి.. సాధించిన విజయాలు మాత్రమే కాదు.. దాని వెనక ఉన్న వాళ్ల కష్టం కూడా చూడాలి మరి! A proper breakfast! How I have missed you! -
మరిన్ని విజయాలతో మీ ముందుకు వస్తా
మున్ముందు మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని పతకాలతో మళ్లీ మీ అందరి ముందుకు వస్తానని ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు తెలిపింది. రియోలో పతకం సాధించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు అపురూపమైన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి గచ్చిబౌలి స్టేడియానికి వచ్చేవరకు అడుగడుగునా పుష్పగుచ్ఛాలు, దండలతో వాళ్లను ముంచెత్తారు. అనంతరం స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ''మీ అందరి మద్దతు, ఆశీర్వాదాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇందుకు గాను మా గురువు గోపీచంద్‌కు చాలా థాంక్స్. మా తల్లిదండ్రులు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్, కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు స్టేడియానికి ఇంతమంది వస్తారని ఏమాత్రం అనుకోలేదు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి మళ్లీ మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను'' అన్నారు. సింధు స్ఫూర్తితో మున్ముందు మరింతమంది మరిన్ని పతకాలను దేశానికి తీసుకురావాలని సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఇంత మంచి స్వాగతం ఏర్పాటుచేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు అని తెలిపారు. విమానాశ్రయం నుంచి వస్తుంటే దారి పొడవునా చిన్నా పెద్దా అందరూ సాదరంగా స్వాగతం పలికారని, మాకు ఇన్ని రోజుల నుంచి మద్దతిచ్చిన మీకు, ప్రభుత్వానికి చాలా చాలా ధన్యావాదాలని అన్నారు. ఇక్కడకు వచ్చిన చాలామంది లాగే తాను కూడా 2000 సంవత్సరంలో కరణం మల్లేశ్వరి పతకం గెలిచినప్పుడు ఆమెను చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. ఇప్పుడు ఉన్న పిల్లల్లో కూడా చాలామంది సింధును స్ఫూర్తిగా తీసుకుని మున్ముందు దేశానికి మరిన్ని పతకాలు తెస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మీరు అందిస్తున్న సహకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. క్రీడల్లో కూడా మన రాష్ట్రం ముందు నిలుస్తుందని భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ నుంచి దేశం పేరు ప్రఖ్యాతులను పెంచేలా ఒలింపిక్స్‌లో గెలవడం సంతోషించదగ్గ విషయమని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు ''ప్రపంచస్థాయికి తెలంగాణ గౌరవాన్ని కాపాడినందుకు సింధును అభినందిస్తున్నాం. క్రీడాకారులను ఇంకా ప్రోత్సహించడానికి సీఎం ఇంకా చాలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ క్రీడాకారులంతా సింధును ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాం'' అని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ''గోపీచంద్ ఇంతమంది ఛాంపియన్లను ఎలా తయారుచేశారో తెలుసుకోడానికి మీరు వచ్చారు.. ప్రధానమంత్రి బేటీ బచావో, బేటీ పఢావో అన్నారు. ఇద్దరు బేటీలు భారతదేశాన్ని బచాయించారు. దేశ కీర్తిపతాకాన్ని ప్రపంచంలో నిలబెట్టారు. మీ అమ్మాయి భారతదేశ పుత్రికగా ఎదిగింది.. అందుకు రమణ, విజయలకు అభినందనలు. మీ త్యాగాల నుంచి కోచ్ శిక్షణ నుంచే ఆమె ఇంత స్థాయికి ఎదిగింది. మంచి క్రీడా విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. సింధు వెనకే ఉండి గోపీ మంత్రాలు చదివారు.. ఆ మంత్రాలు ఏంటో మాకు చెప్పలేదు గానీ, అవే ఆమెకు పతకం సాధించిపెట్టాయి'' అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ''ఒలింపిక్ ఛాంపియన్‌గా దేశ కీర్తిప్రతిష్ఠలను సింధు, ఆమె గురువర్యులు గోపీచంద్, తల్లిదండ్రులతో పాటు మా అందరికీ ఇది చాలా సంతోషకరమైన రోజు. దేశ పరువును నిలబెట్టింది ముగ్గురూ ఆడబిడ్డలే. సింధు, సాక్షి మాలిక్ పతకాలు సాధించగా దీపా కర్మాకర్ కూడా శాయశక్తులా ప్రయత్నించింది. భవిష్యత్తులో తప్పకుండా గోల్డ్ మెడల్ వస్తుంది'' అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ''జై సింధు.. జై తెలంగాణ.. జై హింద్. దేశం పేరు, తెలంగాణ పేరు నిలబెట్టిన సింధుకు, ఆమె తల్లిదండ్రులకు అభినందనలు. సీఎం కేసీఆర్ నెంబర్ 1 సీఎం అయితే సింధు ప్రపంచంలోనే నెంబర్ 2గా నిలిచింది. సింధు స్ఫూర్తితో తెలంగాణ నుంచి మరింత మంది మరిన్ని పతకాలు తేవాలి. సింధు కూడా ఈసారి తప్పనిసరిగా స్వర్ణపతకం సాధిస్తుంది'' అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. -
'మరిన్ని విజయాలతో మీ ముందుకు వస్తా'