సింధు.. కర్ణాటక అమ్మాయి: సీఎం
పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా.. తెలంగాణ అమ్మాయా అన్న అనుమానం అక్కర్లేదు. ఆమె కర్ణాటక అమ్మాయి అని హరియాణా సీఎం తేల్చేశారు. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించి రియోలో భారతదేశానికి తొలి పతకం అందించిన సాక్షి మాలిక్‌ను ఆమె సొంత రాష్ట్రం హరియాణాలో ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆమెకు రూ. 2.5 కోట్ల పురస్కారం అందించారు. అయితే.. అదే సందర్భంలో పీవీ సింధు విషయంలో మాత్రం ఆయన మాట తడబడ్డారు. సింధును కర్ణాటకకు చెందిన అమ్మాయి అని చెప్పారు. చివరకు ఆమె పేరు కూడా సరిగా పలకలేదు.
వరుసపెట్టి టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్.. ఇలా చాలా క్రీడల్లో ఒక్క పతకం కూడా రాక భారతీయులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయిన తరుణంలో సాక్షి మాలిక్ దేశానికి మొట్టమొదటి పతకం అందించింది. రియో నుంచి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీలోను, తర్వాత హరియాణాలోను కూడా ఘన స్వాగతం లభించింది.
అయితే.. సాక్షిమాలిక్‌ను సత్కరించే సందర్భంలో హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సింధు పేరేంటో మర్చిపోయారు. అంతేకాక, ఆమెను కన్నడ అమ్మాయి అని చెప్పారు. నిజానికి మంత్రులు ఒలింపిక్ క్రీడాకారులను మర్చిపోవడం ఇది మొదటిసారి ఏమీ కాదు. దీపా కర్మాకర్ పేరును సాక్షాత్తు కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ తప్పుగా చెప్పారు.